రెచ్చిపోతున్న మట్టి మాఫియా
అశ్వరావుపేటలో రూ.50 లక్షల విలువైన మట్టి దొంగల పాలు
అశ్వారావుపేట,( ఆంధ్రప్రభ):
అశ్వరావుపేటలో మట్టి మాఫియా పెట్రేగిపోతుంది. పట్టణ నడిబొడ్డున సుమారు 50 లక్షల రూపాయలు విలువైన మట్టి ఎటువంటి అనుమతులు లేకుండా ఓ ల్యాండ్ ఫిల్లింగ్ కోసం వినియోగించారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మండల వ్యాప్తంగా జరుగుతున్న మట్టి మాఫియా దందాపై రెండు రోజుల క్రితమే జిల్లా మైనింగ్ శాఖ అధికారులు పలుచోట్ల తవ్వకాలు జరిపిన ప్రదేశాలను సందర్శించి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అనుమతులు లేకుండా ఎవరైనా మట్టిని తరలిస్తే కఠినమైన చర్యలు తీసుకునేలాగా మైనింగ్ అధికారులు స్థానిక తహసీల్దార్ తో కలిపి ఆదేశాలు జారీ చేశారు. అయినా పట్టణ నడిబొడ్డున భద్రాచలం రోడ్ లో గల ఓ కళ్యాణ మండపం పక్కన సుమారు 50 లక్షల రూపాయలు విలువైన మట్టిని యథేచ్ఛగా అక్రమార్కులు ఎటువంటి అనుమతులు లేకుండా తరలించి సొమ్ము చేసుకున్నారు.
ఓవైపు పట్టణంలో మైనింగ్ అధికారులు తాసీల్దారు మట్టి తవ్వకాలపై సందర్శన చేస్తున్నా సరే అదేవిధంగా ఇక్కడ మాత్రం మట్టి పూడ్చివేత పనులు ఆపకపోవడం పట్టణంలో పెను సంచలనంగా మారింది.మట్టి అవసరం అయిన ఓ సీనియర్ తెరచాటు రాజకీయ నాయకుడు తనకున్న స్థానిక పరిచయాలను అడ్డంపెట్టి బహిరంగంగా అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం. అంతేకాకుండా బహిరంగంగా ఈ విధంగా లక్షలాది రూపాయల అక్రమ మట్టి గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్న సరే సంబంధిత శాఖల అధికారులు ఎవరూ ఇటువైపు కన్నెత్తి చూడకపోవడం పట్ల సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
తక్షణమే జిల్లా మైనింగ్ శాఖ అధికారులు స్పందించి అక్రమ మట్టి త్రవ్వకాలకు పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సామాన్యుడు ఇంటి కోసం అవసరమైతేనే నానా ఇబ్బంది పెట్టే రెవెన్యూ మైనింగ్ శాఖ అధికారులు ఈ విధంగా లక్ష రూపాయల అక్రమానికి పాల్పడిన వారిపై ప్రభుత్వం నిబంధనల ప్రకారం మైనింగ్ యాక్ట్ ను అనుసరించి రికవరీ చేయాలని ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.
తాసీల్దార్ వివరణ: అక్రమ మట్టి, గ్రావెల్ తోలకాలపై తాసిల్దార్ రామకృష్ణ మాట్లాడుతూ.. మట్టి త్రవ్వకాలపై నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. అదేవిధంగా పట్టణంలో మట్టి తవ్వకాలు జరిపిన వారిపై సమగ్ర విచారణ నిర్వహించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

