నిందితుడు దొరికాడు..

హైదరాబాద్ : కూకట్‌పల్లి ప్రాంతాన్ని కుదిపేసిన చిన్నారి స‌హ‌స్ర‌ హత్య కేసు మిస్టరీకి తెరపడింది. ఈ కేసు మొదట్లో హ‌త్య చేసింది కరుడుగట్టిన నేరస్థుడే అని భావించారు. అయితే, పోలీసుల దర్యాప్తులో నిజం పూర్తిగా భిన్నంగా తేలింది. పోలీసులు సాయి అనే పదేళ్ల‌ బాలుడిని అరెస్టు చేసి, అతడే ఈ దారుణానికి ఒడిగ‌ట్టాడ‌ని నిర్ధారించారు.

పోలీసుల‌ వివరాల ప్రకారం,
సహస్ర పక్కింట్లో నివసిస్తున్న సాయి, ఆమె ఇంట్లోకి దొంగతనానికి ప్రయత్నించాడు. చేతిలో కత్తి పట్టుకుని లోపలికి వెళ్లి సుమారు రూ.80 వేల‌ నగదు దొంగిలించాడు. బయటకు వస్తున్న సమయంలో సహస్ర అతన్ని చూసేసరికి, సాయి ఆమెను కొట్టి, గొంతు నులిమి ప్రాణం తీసే ప్రయత్నం చేశాడు.

అయితే, సాయి అక్కడితో ఆగలేదు… సహస్ర పూర్తిగా చనిపోయిందా లేదా అని నిర్ధారించుకోవడానికి ఆమెపై కత్తితో పలు సార్లు దాడి చేశాడు. ఈ ఘటన క్షణిక ఆవేశంలో జరిగినది కాదని, ముందస్తు ప్రణాళిక ప్రకారం అమలుచేశాడని పోలీసులు వెల్లడించారు. ఎవరైనా అడ్డొస్తే ఎలా స్పందించాలో కూడా సాయి ముందే ఆలోచించి సిద్ధంగా ఉన్నాడని విచారణలో బయటపడింది.

ఈ ఘటన జరిగిన రోజు సాయిని ఆ పరిసరాల్లో చూసినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ ఆధారంతో విచారణ ప్రారంభించిన పోలీసులు చివరకు నిందితుడిని పట్టుకున్నారు. విచారణ ప్రారంభంలో సాయి తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశాడు.

సహస్ర తమ్ముడితో క్రికెట్ ఆడేందుకే ఇంటికి వచ్చానని చెప్పాడు. కానీ కఠిన విచారణలో నిజం బయటపడింది. చివరికి అతడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. సాయికి సహకరించిన మరెవరైనా ఉన్నారా అనే కోణంలో ఇంకా దర్యాప్తు కొనసాగుతుంద‌ని పోలీసులు తెలిపారు.

ఈ ఘటన కూకట్‌పల్లి ప్రాంత ప్రజల్లో భయానక వాతావరణాన్ని సృష్టించింది. చిన్న వయసులోనే ఇంత దారుణంగా, పూర్తిగా ప్రణాళికాబద్ధంగా నేరానికి పాల్పడటం అందరిని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. సాధారణంగా దొంగతనం చేయాలనుకున్నా, అడ్డొస్తే చంపేయాలని ముందే ప్లాన్ చేసుకోవ‌డం, ఒక కుర్రవాడి మనసులో ఇంతటి హింసాత్మక ఆలోచనలు పుట్టుకురావ‌డం స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తుంది.

Leave a Reply