అక్కడ స్పెషల్ ఫోకస్ పెట్టిన ఎమ్మెల్యే
గూడూరు, అక్టోబర్ 28 (ఆంధ్రప్రభ) : మొంథా తుఫాన్ (MonthaCyclone) ప్రభావంతో సోమవారం నుండి గూడూరు నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాభావం వలన తీర ప్రాంత ప్రజలు, గిరిజనులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అధికారులు ఎప్పటికప్పుడు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా మంగళవారం వేకువజాము నుండి కురుస్తున్న వర్షాభావంతో అధికారులు అప్రమత్తమై లోతట్టు ప్రాంతాలను పరిశీలించి ఎమ్మెల్యే సహకారంతో నాయకుల ఆధ్వర్యంలో ఆహారం సైతం అందించడంలో నిరంతరం కృషి చేస్తున్నారు. మంగళవారం గూడూరు నియోజకవర్గంలోని తీర ప్రాంతమైన వాకాడు పులపాలెం, బాల్రెడ్డిపాలెం, వెంకన్నపాలెం, స్వర్ణముఖి బ్యారేజ్ వంటి తదితర ప్రాంతాలలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాశిం కుమార్ అధికారులతో కలిసి సందర్శించి తీరప్రాంతాలలో ప్రజల సమస్యలు తెలుసుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
అదేవిధంగా నియోజకవర్గంలోని స్థానిక నాయకులు తప్పనిసరిగా తుఫాన్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు అధికారులు నిరంతరం అందుబాటులో ఉండాలి అన్నారు. అధికారులతో కలిసి అన్ని ప్రాంతాలను పర్యవేక్షిస్తూ ప్రజలకు అన్ని వసతులు ఏర్పాటు చేసే విధంగా పని చేయాలని ఆదేశించారు. గూడూరు (Guduru) మండలంలో విందూరు గ్రామంలో ఒక పునరావాస కేంద్రం కల్పించి కొంతమందిని అందులో ఉంచారు. అదేవిధంగా చిల్లకూరు మండలంలోని తమ్మిన పట్నం గ్రామంలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి 96 మంది గిరిజనులను అక్కడ ఉంచారు. అలాగే వారికి ఆహారం త్రాగునీరు సదుపాయం కల్పిస్తున్నారు. అదేవిధంగా చిల్లకూరు మండలంలో తాసిల్దారు శ్రీనివాసులు ఓడూరు, కృష్ణాపురం గిరిజన కాలనీ వంటి తదితర ప్రాంతాలలోని గిరిజనులకు దాదాపు 500 మంది వరకు ఆహారం త్రాగునీరు సదుపాయం కల్పిస్తున్నారు. అదేవిధంగా కోట మండలంలోని చిట్టెడు గ్రామంలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి తాహసిల్దార్ జై జై రావు తీర ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వారిని పునరావాస కేంద్రానికి తరలించేందుకు వాహనాలు కూడా సిద్ధం చేసి అన్ని వసతులు ఏర్పాటు చేసి ఉంచారు.
అదేవిధంగా గూడూరు మండలం చెన్నూరు గ్రామంలో తిరుపతి పార్లమెంట్ మహిళా ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి రెడ్డి ఆధ్వర్యంలో చెన్నూరు గ్రామం గిరిజన కాలనీని సందర్శించారు. అక్కడ గిరిజనులకు ఎటువంటి ఇబ్బందులు కలుగుకుండా వారికి అవసరమయ్యేటటువంటి అన్ని వసతులను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. పట్టణంలో ప్రత్యేక అధికారి శోభన్ బాబు ఆధ్వర్యంలో పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు పట్టణంలోని పలు ప్రాంతాలు పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టడంతో పాటు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోటు పాలెం గ్రామంలో ఎమ్మెల్యే సూచనల మేరకు కోటా సునీల్ కుమార్, కమిషనర్ వెంకటేశ్వర్లు రూరల్ ఎస్సై తిరుపతయ్య ఆధ్వర్యంలో గిరిజనులకు ఆహారం అందజేసి వారికి ఎటువంటి అవసరం వచ్చిన నిత్యం అందుబాటులో ఉండడం జరుగుతుందని భరోసా ఇచ్చారు.

