ఉట్నూర్, ఏప్రిల్ 11 (ఆంధ్రప్రభ) : ఫూలే దంపతుల జీవితం అందరికీ ఆదర్శప్రాయమని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శుక్రవారం అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావుఫూలే 198వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే ఫూలే దంపతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… అణగారిన వర్గాల అభ్యున్నతికి ఫూలే దంపతులు చేసిన త్యాగం మరువలేనిదన్నారు. అట్టడుగు వర్గాల్లోని ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయులు మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రి బాయి ఫూలే దంపతులని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. దేశంలో మొట్టమొదటగా పాఠశాలలను నెలకొల్పి మహిళలకు విద్యను అందించారని తెలిపారు. సమాజ హితం కోసం వారు చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. నేటి యువత ఫూలే దంపతులను ఆదర్శంగా తీసుకుని, వారి అడుగు జాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ లింగంపల్లి చంద్రయ్య, జైనోద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జైవంత్ రావు, ఉట్నూరు సహకార చైర్మన్ సామా ప్రభాకర్ రెడ్డి, లక్కారం మాజీ సర్పంచ్ మర సూకోల తిరుపతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.