Neelima | జూబ్లీహిల్స్ ఫలితమే నిదర్శనం…

Neelima | జూబ్లీహిల్స్ ఫలితమే నిదర్శనం…

Neelima | స‌న‌త్ న‌గ‌ర్‌, ఆంధ్ర‌ప్ర‌భ : కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ (Dr. Kota Neelima) పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయంతో సనత్ నగర్ నియోజకవర్గంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని, అందువల్లే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఈ స్థాయి గెలుపు సాధ్యం అయిందని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ రెండేళ్ల పాలనకు నిదర్శనమ‌ని, కాంగ్రెస్ పరిపాలనపై ప్రజలు సంతృప్తితో ఉన్నారని అన్నారు.

ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ తమ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలే (Welfare schemes) ఈ ఆధిక్యానికి కారణమని వివరించారు. సన్న బియ్యం, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, ఉద్యోగ నియామకాలు వంటి కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం కోసం తీసుకున్న నిర్ణయాలు కూడా సత్ఫలితాలనిస్తున్నాయని, ప్రజలు తమ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.

ఎవరేమి చేశారో జూబ్లీహిల్స్ ప్రజలకు తెలుసన్నారు. 10ఏళ్లు ఏమి చేయలేని బీఆర్ఎస్ (BRS) తప్పుడు ప్రచారం చేసినా కూడా ప్రజలు విశ్వసించలేదని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి పక్కా లోకల్ బీసీ బిడ్డ అని.. అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ సెంటిమెంట్‌ను రగిలించినా కూడా ప్రజలు విశ్వసించలేదని తెలిపారు. కేటీఆర్ బుల్డోజింగ్ అని ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదన్నారు. అవేమి నమ్మకుండా ప్రజలు నవీన్ యాదవ్‌కే అవకాశం ఇచ్చారని తెలిపారు.

అందుకే ప్రజలు కాంగ్రెస్ (Congress) కు పట్టం కట్టారని తెలిపారు. సీఎం, కాంగ్రెస్ ప్రభుత్వ పని తీరుకు ఈ విజయం ఫలితమన్నారు. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ప్రజలను మతం పేరుతో విడదీసే బీజేపీకి డిపాజిట్ కూడా దక్కలేదన్నారు. బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు టపాకాయలు కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply