కృష్ణా జిల్లాను కుదిపేసిన మొంథా

కృష్ణా జిల్లాను కుదిపేసిన మొంథా
అంధకారంలో గ్రామాలు
(ఆంధ్రప్రభ – కృష్ణా జిల్లా ప్రతినిధి): మొంథా తుఫాను కృష్ణా జిల్లా (Krishna district) ను ఒక్కసారిగా కుదిపేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఒక్కసారిగా తీవ్ర వాయుగుండంగా మారి తీరం దాటింది. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో తీవ్ర ప్రభావం చూపించింది. మచిలీపట్నంలో ఎన్నడూ లేని విధంగా ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుండటంతో ప్రజలు భయపడుతున్నారు. కొన్నేళ్లు క్రితం ఇలాంటి పరిస్థితి చూశామని తెలిపారు. మచిలీపసట్నంలోని మంగినపూడి బీచ్, అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలోని హంసలదీవి బీచ్ వద్ద అలలు ఉధృతి పెరిగింది. జిల్లా వ్యాప్తంగా భారీ ఈదురుగాలులు వీస్తున్నాయి.

అక్కడ భారీ ఈదురుగాలులు :
కృష్ణా జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాలైన మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ నియోజకవర్గాల్లో భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. అధికారులు ముందుగానే అప్రమత్తమై ఎవరిని బయటకు రావొద్దని మైక్ ద్వారా ప్రచారం చేపట్టారు. మచిలీపట్నం (Machilipatnam)లో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు కురుస్తున్న వర్షంతో పాటు ఈదురుగాలులకు ప్రజలు భయాందోళన చెందుతున్నారు. సముద్రం అల్లకల్లోలంగా మారటంతో మెరైన్ అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. మత్స్యకారులు ఎవరు అటు వైపుకు వెళ్లకుండా పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు.

నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు, వృక్షాలు :
తుఫాన్ తీవ్రత (Typhoon intensity) తో మచిలీపట్నం మంగినపూడి బీచ్ కు వెళ్లే దారిలో, మచిలీపట్నంలోని పలు ప్రాంతాల్లో ఉన్న భారీ వృక్షాలు నేలకొరిగాయి. తాడిచెట్లు విద్యుత్ వైర్లు, స్థంభాల పై పడటంతో పాటు పలు చోట్ల తాడిచెట్లు నేలకొరియగాయి. కోడూరు మండలంలోని పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగి రహదారి పై పడిపోవటంతో ప్రయాణానికి ఇబ్బందికరంగా మారింది. అదే విధంగా ఈదుర గాలులకు విద్యుత్ స్తంభాలు విరిగి పడిపోయాయి. మొవ్వ మండలం కాజ, భట్లపెనుమర్రుల్లో కొబ్బరిచెట్లు విరిగి విద్యుత్ తీగల పై పడటంతో స్తంభాలు విరిగిపోయి వైర్లు తెగిపోయాయి. పెదపూడిలో వృక్షం విరిగిపడిపోయింది. మంత్రిపాలెం శివారు మాకులవారిపాలెంలో చెట్లు విరిగి విద్యుత్ తీగల పై పడటంతో వైర్లు తెగిపోయాయి.

జిల్లాలోని 26 మండలాల్లో ఈదురుగాలులకు విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది. అంధకారంలో గ్రామాల ప్రజలు మగ్గిపోతున్నారు. విద్యుత్ అదికారులు శాయశక్తులా కృషి చేస్తున్నా ఈదురు గాలులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్టీఆర్ బృందాలు మచిలీపట్నంలోనూ, గుడివాడలోనూ పలు ప్రాంతాలలో చెట్లను తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పోలీసు, రెవెన్యూ, పంచాయతీ శాఖలు నిరంతరాయంగా సేవలు అందిస్తున్నారు. విద్యుత్ శాఖ సిబ్బంది బుధవారం ఉదయం నుంచి ఆయా గ్రామాల్లో తిరుగుతూ స్థంభాల పై ఎక్కడెక్కడ వైర్లు ఊడిపోయాయో వాటిని సరి చేస్తున్నారు. సముద్ర తీర ప్రాంతమైన మచిలీపట్నంలో భారీ ఈదురుగాళ్లతో స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, తాడిచెట్లు పడిపోయాయి. మచిలీపట్నంలో విపరీతమైన గాలులతో కూడిన వర్షపాతం నమోదు కావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది.
200లకుపైగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు :
తుఫాన్ నేపథ్యంలో కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ (Krishna District Collector Balaji) అధికారులను అప్రమత్తం చేయటంతో జిల్లా వ్యాప్తంగా 200లకు పైగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రామ సర్పంచులు, అధికారులు రాత్రి ఉదయం, మధ్యాహ్నం భోజనం, టిఫిన్ ఏర్పాటు చేస్తున్నారు. అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన, పామర్రు, గన్నవరం, పెనమలూరు, గుడివాడలోని పునరావస కేంద్రాల్లో ప్రజలకు సౌకర్యాలు కల్పించారు.
నేలకొరిగిన వరి పంట :
కృష్ణా జిల్లా వ్యాప్తంగా 1.50 లక్షల హెక్టార్ల వరి సాగు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా సుంకు దశలో ఉన్న పంట నేలకొరగడంతో రైతన్నలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు, కౌలు రైతులు కోరుతున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంట నేలపాలు కావడంతో కన్నీరు పెడుతున్నారు. బుధవారం ఉదయం సైతం ఈదురుగాళ్లు భారీగా వీచాయి.
సహాయక చర్యలు చేపట్టిన ఉద్యోగులు :
కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులకు చెట్లు రహదారి అడ్డుగా పడిపోవడంతో సహాయక చర్యల్లో ఉద్యోగులు నిమగ్నమయ్యారు. పోలీసు పంచాయతీ రెవిన్యూ ఇతర శాఖల అధికారులు గ్రామాల్లోకి వెళ్లి రహదారులకు అడ్డుగా పడిన చెట్లను తొలగించే కార్యక్రమం చేపట్టారు. విద్యుత్ పునరుద్ధరణ కోసం గ్రామాలలోని సిబ్బంది నిరంతరాయంగా కృషి చేస్తున్నారు ఒక పక్క ఈదురుగాలులు వీస్తూ వర్షం కురుస్తుండడంతో పని మధ్యలో ఆగిపోతుంది.
