యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం..
హుజూర్‌నగర్, ఆంధ్రప్రభ : రాష్ట్ర వ్యాప్తంగా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) అన్నారు. హుజూర్‌నగర్ పట్టణంలో ఈనెల 25న పేర్ల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ పాఠశాలలో నిర్వహించనున్న జాబ్ మేళా ఏర్పాట్లు పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం ఇటీవల గ్రూప్1, గ్రూప్2 ఉద్యోగాల నియామక పత్రాలు అభ్యర్థులకు అందజేస్తామని, ఇప్పటికే సుమారుగా 70వేల ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేపట్టడంతో పాటు ప్రైవేటు రంగం(Private Sector)లో కూడా భారీ సంఖ్యలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు.
సమాజంలో నిరుద్యోగ సమస్య అతిపెద్ద సవాల్ గా మారిందని తల్లిదండ్రులు కూడబెట్టిన ఆస్తులను అమ్మి తమ పిల్లలు భవిష్యత్తు బాగుండాలని పెద్ద చదువులు చదివించినా అనుకున్న రీతిలో వారికి ఉద్యోగాలు రావటం లేదని ఆ విషయంలో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలోని డీట్ (డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి ఆఫ్ తెలంగాణ ), సింగరేణి కాలరీస్ వారి సహకారంతో ఈ నెల 25న దేశంలోనే భారీ జాబ్ మేళాను హుజూర్ నగర్(Huzurnagar)లో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు .
ఇప్పటికే 205 కంపెనీలు, 9500 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయన్నారు. జాబ్ మేళాకు వచ్చే అభ్యర్థులకు సౌకర్యార్థం ఉదయం టిఫిన్ మధ్యాహ్నం లంచ్, సాయంత్రం టిఫిన్ ఏర్పాటు చేస్తున్నామని అలాగే జాబ్ మేళా కు వచ్చేవారికి పార్కింగ్ సమస్య లేకుండా చూస్తున్నామన్నారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రిజిస్ట్రేషన్ కౌంటర్ల(Registration Counters) వద్ద, కంపెనీ స్టాల్స్ వద్ద, భోజనాలు వద్ద స్థానిక నాయకులతో కమిటీ వేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని మంత్రి ఉత్తమ్ తెలిపారు. జాబ్ మేళాను విజయవంతం చేయుటకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నామని ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్(MLC Shankar Nayak), జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహ, డీట్ ప్రతినిధి వంశీ, సింగరేణి ప్రతినిధి చందర్, ఆర్డీవోలు శ్రీనివాసులు, స్తానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
