- ఎస్పీ అద్నాన్ నయీం అస్మి
- పశ్చిమలో కార్డెన్ సెర్చ్
- పత్రాలు లేని బైక్‌ల స్వాధీనం
POLICE | భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ: పశ్చిమగోదావరి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణే ధ్యేయంగా పనిచేస్తున్నామని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ద్విచక్ర వాహనాల దొంగతనాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా శనివారం కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నర్సాపురం డీఎస్పీ జి.శ్రీవేద నేతృత్వంలో పెనుగొండ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆర్.విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఆచంట మండలం పెదమల్లం గ్రామంలో తెల్లవారుజామున 5:15 నుంచి 7:25 వరకు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సోదాల్లో సరైన రిజిస్ట్రేషన్ పత్రాలు, యజమాని వివరాలు సరిగా లేని పలు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహనాలకు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించేందుకు వాటిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా సీఐ విజయ్ కుమార్ గ్రామంలోని స్థానిక ప్రజలతో ముఖాముఖి మాట్లాడి కౌన్సెలింగ్ ఇచ్చారు. ప్రతీ ద్విచక్ర వాహనం తప్పనిసరిగా దాని యజమాని పేరుపైనే రిజిస్ట్రేషన్ అయి ఉండాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అంతేకాక, గ్రామాల్లోకి కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు లేదా, ఎవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు గమనించినట్లయితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని గ్రామస్తులను కోరారు. ప్రజల భద్రతకు పోలీసులు కట్టుబడి ఉన్నారని, నేర రహిత వాతావరణాన్నిసృష్టించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు భవిష్యత్‌లో కూడా గ్రామాల్లో ఎప్పటికప్పుడు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తామని సీఐ స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో ఆచంట ఎస్సై కె.వెంకట రమణ, పెనుగొండ ఎస్సై కె.గంగాధర్, పెనుమంట్ర ఎస్సై కె.స్వామి, సర్కిల్ సిబ్బంది పాల్గొన్నారు.

