పదో తరగతిలో వందశాతం ఫలితాలే లక్ష్యం..

- విద్యార్థుల్లో కంప్యూటర్ అవగాహన పెంపుపై దృష్టి
- వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ అవసరం
- విద్యాశాఖ అధికారి గోవిందరాజు
ఊట్కూర్, ఆంధ్రప్రభ : పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా ఉపాధ్యాయులు విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయాలని నారాయణపేట జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజు అన్నారు. 6 నుండి 10వ తరగతి విద్యార్థులకు కన్ అకాడమీ సైడ్ చూసే విధంగా ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.
శుక్రవారం ఊట్కూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర, సిపిఎస్ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా పాఠశాలల్లోని వివిధ తరగతి గదులు పరిశీలించి రికార్డులు తనిఖీ చేశారు. పదో తరగతి, రెండో తరగతి విద్యార్థులకు వివిధ ప్రశ్నలు వేసి జవాబులు రాబట్టారు.
ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ… చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు కంప్యూటర్ విద్య పై పూర్తి అవగాహన పెంచడంతో పాటు గ్రంథాలయాల్లో వివిధ రకాల పుస్తకాలు చదివే విధంగా చూడాలని ఆదేశించారు.
పదవ తరగతి విద్యార్థులకు ఉదయం 6 నుండి 9 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించి సాయంత్రం పరీక్షలు నిర్వహించాలన్నారు. మధ్యాహ్న భోజనం పథకంలో మెనూ పాటిస్తూ నాణ్యమైన భోజనం వడ్డించాలన్నారు. ఉపాధ్యాయులు విధిగా సమయపాలన పాటించాలని అన్నారు.
సిపిఎస్ పాఠశాలలో రెండో తరగతి విద్యార్థులు లెక్కలు వేసి వారి నుండి జవాబు రాబట్టగా సరియైన సమాధానం చెప్పడంతో విద్యార్థులను అభినందించారు. ఆయా పాఠశాలల్లోని వివిధ తరగతి గదులు పరిశీలించి పలు సలహాలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ హెచ్ఎం మురళి, హెచ్ఎం గురునాథ్, ఆయా పాఠశాలలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
