రేపు ఘట్‌కేసర్‌లో అందెశ్రీ అంత్యక్రియలు

రేపు ఘట్‌కేసర్‌లో అందెశ్రీ అంత్యక్రియలు
ప్రభుత్వ లాంఛనలతో అంతిమ సంస్కారాలు
లాలాపేట నివాసానికి అందెశ్రీ పార్దీవ దేహం
రేవంత్ రెడ్డి, కేసీఆర్ దిగ్భ్రాంతి
వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (Ande Sri) అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనలతో ఘట్‌కేసర్‌లో నిర్వహించనున్నారు. ఈ రోజు ఉదయం ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (అందె ఎల్లయ్య) గాంధీ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. అందెశ్రీ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు చీఫ్ సెక్రటరీ జీవో విడుదల చేశారు. ఈ జీవో మేరకు హైదరాబాద్, రంగారెడ్డి, మల్కాజిగిరి జిల్లా కలెక్టర్లు, హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లు ఏర్పాట్లు చేస్తున్నారు.
కుటుంబ సభ్యుల సూచన మేరకు ఘట్‌కేసర్ ఎన్ఎఫ్‌సీ నగర్‌లో అందెశ్రీ అంత్యక్రియలు నిర్వహించేందుకు నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు లాలాపేటలోని అందెశ్రీ నివాసానికి తరలిస్తున్నారు. అనంతరం మధ్యాహ్నం ప్రజల సందర్శనార్థం జయశంకర్ స్టేడియాని (Jayashankar Stadium)కు తరలించనున్నారు. ఈ క్రమంలోనే అందెశ్రీకి కడసారి నివాళులర్పించేందుకు పలువురు ప్రముఖులు లాలాపేటలోని ఆయన నివాసానికి తండోపతండాలుగా వెళ్తున్నారు. ఈ రోజు సాయంత్రం అందెశ్రీ పార్దీవ దేహాన్ని సీఎం రేవంత్ రెడ్డి సందర్శించి నివాళులు అర్పిస్తారు. ఘట్కేసర్ లో రేపు(మంగళవారం) జరగనున్న అందెశ్రీ అంత్యక్రియలకు సీఎం హాజరుకానున్నారు.
తెలంగాణ సాహితీ శిఖరం నేల కూలింది…
ప్రముఖ రచయిత, కవి, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ మృతికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర గీతం కొత్త స్వరాలతో రూపకల్పన చేసుకున్నామని, అందెశ్రీ తో కలిసి పంచుకున్న ఆలోచనలు, ఆయనతో తనకున్న అనుబంధాన్ని సీఎం ఈ సందర్భంగా స్మరించుకున్నారు. తెలంగాణ సాహితీ శిఖరం నేల కూలింది అంటూ.. ఆయన మరణం పట్ల సీఎం సంతాపాన్ని వ్యక్తం చేశారు. అలాగే స్వరాష్ట్ర సాధనలో, జాతిని జాగృతం చేయడంలో ఆయన చేసిన కృషి చిరస్థాయిగా నిలిచి ఉంటుందన్నారు. ఈ విషాద సమయంలో అందెశ్రీ కుటుంబ సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.
అందెశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటు: కేసీఆర్
ప్రముఖ కవి, ‘జయ జయహే తెలంగాణ…’ ఉద్యమ గీత రచయిత డాక్టర్ అందెశ్రీ మరణం పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (Kalvakuntla Chandrasekhar Rao) దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ తన సంతాపాన్ని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో కవిగా తన పాటలతో, సాహిత్యంతో కీలక పాత్ర పోషించిన అందెశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటన్నారు. ఉద్యమ కాలంలో అందెశ్రీతో తనకున్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. అందెశ్రీ మరణంతో శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. దివంగత అందెశ్రీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్ ప్రార్థించారు.
