(చందర్లపాడు, ఆంధ్రప్రభ) : సమాజంలో పేదరికాన్ని సమూలంగా నిర్మూలించాలనే గొప్ప లక్ష్యంతో సీఎం చంద్రబాబు దార్శనికతకు అనుగుణంగా ప్రభుత్వం ప్రారంభించిన పీ4 (పబ్లిక్, ప్రైవేటు, పీపుల్ పార్ట్‌నర్‌షిప్) కార్యక్రమంలో మరో గొప్ప ముందడుగు పడింది. రాష్ట్రంలోనే తొలిసారిగా నందిగామ నియోజకవర్గం, ముప్పాళ్లలో బంగారు కుటుంబాలకు మార్గదర్శుల ద్వారా సహాయం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కేవలం ఆర్థిక సహాయం అందించి ఊరుకోవడమే కాదు.. ఓ పేద కుటుంబాన్ని పేదరికం నుంచి పూర్తిగా బయటపడే వరకు, ఆర్థికంగా నిలదొక్కుకొని సమాజంలో సగర్వంగా నిలబడేవరకు, ఆ కుటుంబం కూడా మార్గదర్శిగా ఎదిగేందుకు మార్గదర్శులు భరోసా కల్పించే ఈ బృహత్తర కార్యక్రమంలో తొలిగా నలుగురు మార్గదర్శులు తాము దత్తత తీసుకున్న కుటుంబాలకు సహాయం అందించారు.
కలెక్టర్ లక్ష్మీశ, ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య.. మార్గదర్శులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి క్రక్స్ బయోటెక్ ద్వారా పగడాల నాగరత్నం కుటుంబానికి, సెంటిని బయో ప్రొడక్ట్స్ ద్వారా కొండ్రు వెంకటరావమ్మ కుటుంబాలకు ఆటోలు అందజేశారు. ప్లైవుడ్ కంపెనీ ద్వారా పగడాల నాగరత్నం, కొండ్రు వెంకటరావమ్మ, ఉప్పెల్లి నాగజ్యోతి, బొబ్బా శ్రీలక్ష్మి, పగడాల ప్రియాంక, బోల్నిది శిరీషలకు కుట్టు మిషన్లు అందజేశారు. అంబా కోచ్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా బంగారు కుటుంబ సభ్యులు కె.లక్ష్మయ్య, కె.రమాదేవి దంపతులకు ఉద్యోగ నియామక పత్రాలు అందించారు. అదేవిధంగా మరో 9మందికి అవసరమయ్యే మందులతో మెడికల్ కిట్లు అందజేశారు.
చేయిపట్టి నడిపించే మిషన్ పీ4….
బంగారు కుటుంబాలు స్వయం సమృద్ధి సాధించేందుకు చేసిన ఈ సహాయపు చిన్న అడుగు పేదల జీవితాల్లో గొప్ప వెలుగు అని, ఈ స్ఫూర్తితో మరో నాలుగు లక్షల మంది మార్గదర్శులు ముందుకు రావాలని కలెక్టర్ లక్ష్మిశ పిలుపునిచ్చారు. ఎన్‌టీఆర్ జిల్లాలోని 96 వేల కుటుంబాలు అభివృద్ధి చెందే వరకు కొనసాగుతుందని, ఆయా కుటుంబాలను మార్గదర్శకులతో అనుసంధానించి, సమాజంలో ఉన్నతంగా ఎదిగే వరకు మార్గదర్శుల ద్వారా సహాయ సహకారాలు అందుతాయన్నారు. ఉదాహరణకు బంగారు కుటుంబంలో ఏడో తరగతి చదువుతున్న ఓ అమ్మాయికి డాక్టర్ కావాలనే కోరిక ఉంటుందని, ఆ చిన్నారి డాక్టర్ కలను సాకారం చేసుకునేందుకు ఏ కాలేజీలో చేరాలి? ఏ కోర్సు చేయాలి? శిక్షణ ఎక్కడ తీసుకోవాలి? ఇలా ప్రతి విషయంలోనూ మార్గదర్శి చేయిపట్టి నడిపించే ఓ విశిష్ట కార్యక్రమం పీ4 అని వివరించారు. మార్గదర్శులు అందించే ప్రతి రూపాయి, ప్రతి సాయం అత్యంత పారదర్శకతతో మార్గదర్శులకు వెళ్తుందన్నారు.
గొప్ప విజనరీ సీఎం చంద్రబాబు…
గొప్ప దార్శనికత ఉన్న ముఖ్యమంత్రిగా మన ముఖ్యమంత్రి చంద్రబాబుకి ప్రపంచ వ్యాప్త గుర్తింపు ఉందని, మనం రేపటి గురించి ఆలోచిస్తే ఆయన 20సంవత్సరాల తర్వాత గురించి కూడా ఆలోచిస్తారని నందిగామ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య అన్నారు. బంగారు కుటుంబాలను గుర్తించడం, వారిని మార్గదర్శికళకు అనుసంధానం చేయడం కలెక్టర్ సారథ్యంలో పీ4 కార్యక్రమం ఇలా ముందుకెళ్తుండటం చాలా ఆనందం కలిగిస్తోందన్నారు.