పారిస్‌లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్‌షిప్స్ 2025లో భారత స్టార్ షట్లర్లు పి.వి. సింధు, హెచ్.ఎస్. ప్రణయ్ రౌండ్ ఆఫ్ 32 (రెండో రౌండ్)లోకి అడుగుపెట్టారు.
మహిళల సింగిల్స్‌లో సింధు బల్గేరియాకు చెందిన కలోయానా నల్బాంటోవాపై 23-21, 21-6 తేడాతో ఘనవిజయం సాధించింది. తొలి గేమ్‌లో 0-4తో కాస్త వెనుకబడిన సింధు, ఆ తర్వాత తన అగ్రెసివ్ గేమ్‌తో ఆధిపత్యం ప్రదర్శించి తొలి గేమ్‌ను కైవసం చేసుకుంది. ఇక రెండో గేమ్‌లో మాత్రం పూర్తి ఆధిపత్యం కనబరిచి కేవలం 34 నిమిషాల్లో మ్యాచ్ ముగించింది.
ఇక సింధు తదుపరి రౌండ్‌లో సలోని సమీర్‌భాయ్ మెహతా (హాంకాంగ్ చైనా) లేదా కరుపతేవన్ లెట్షానా (మలేషియా)తో తలపడనుంది.
అంతకుముందు, పురుషుల సింగిల్స్‌లో హెచ్.ఎస్. ప్రణయ్ 47 నిమిషాల సుదీర్ఘ పోరులో ఫిన్లాండ్‌కు చెందిన జోకిమ్ ఓల్డారఫ్పై 21-18, 21-15 తేడాతో గెలిచాడు. ప్రణయ్ తదుపరి రౌండ్‌లో సెకండ్ సీడ్ ఆండర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)ను ఎదుర్కొనే అవకాశం ఉంది.
ఇక మిక్స్‌డ్ డబుల్స్‌లో రోహన్ కపూర్ – రుత్విక గద్దె జోడీ, మకావ్ చైనా ఆటగాళ్లు లియాంగ్ ఐఒక్ చాంగ్ – ఎన్‌జి వెంగ్ చి జంటను ఎదుర్కొననున్నారు.