సింగరేణి నుంచి రాష్ట్రంలోనే తొలి పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ !

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో సింగరేణి కాలరీస్ కంపెనీ మరో వినూత్న విద్యుత్ ఉత్పాదన ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. రామగుండం–1 ఏరియాలోని మూతపడిన మేడిపల్లి ఓపెన్ కాస్ట్ గనిలో ఏర్పడిన నీటి సంపును ఆధారంగా 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ (PSP) నిర్మాణానికి తొలి అడుగు వేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఆదేశాలతో ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు.

ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయి ప్రాజెక్ట్ నివేదిక (DPR) తయారీకి ప్రభుత్వ రంగ సంస్థ అయిన వైఆప్కోస్ లిమిటెడ్‌కు బాధ్యత అప్పగించారు. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ విషయాన్ని సీఎండీ ఎన్. బలరామ్ వెల్లడించారు. రాష్ట్రంలో ఇటువంటి ప్రాజెక్టును మొదటిసారిగా చేపట్టడం గర్వకారణమని, ఇది ప్రయోగాత్మకంగా విజయవంతమయ్యే అవకాశముందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది సాధారణ జలవిద్యుత్ ప్రాజెక్టుల తరహాలో పనిచేస్తుంది. పగటిపూట సోలార్ విద్యుత్తుతో నీటిని పైభాగంలో నిర్మించే రిజర్వాయర్‌లోకి పంపించి, రాత్రివేళ దానిని కిందికి పంపిస్తూ మధ్యలో టర్బైన్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. మేడిపల్లిలో ఇప్పటికే 157 మీటర్ల లోతు కలిగిన నీటి సంపు ఉండటంతో, అదే ప్రదేశాన్ని ప్రాజెక్టు కోసం ఎంపిక చేశారు. ఉపరితలంపై 2,350 మీటర్ల పొడవుతో, 23 మీటర్ల లోతులో భారీ రిజర్వాయర్ నిర్మించనున్నారు.

ప్రాజెక్ట్ ఖర్చు దాదాపు ₹3,000 కోట్లుగా అంచనా వేయబడుతోంది. అయినప్పటికీ, ఇది సింగరేణికి 40 ఏళ్ల పాటు స్థిరమైన ఆదాయ వనరిగా నిలవనుందని సంస్థ భావిస్తోంది. డిపిఆర్ పూర్తైన వెంటనే నిర్మాణానికి సంబంధించిన టెండర్లు పిలవనున్నారు.

ఈ కార్యక్రమంలో సింగరేణి సంస్థకు చెందిన ఉన్నతాధికారులు – డైరెక్టర్ ఈ అండ్ ఎం డి. సత్యనారాయణ రావు, డైరెక్టర్ ఆపరేషన్స్ ఎల్.వి. సూర్యనారాయణ, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ కే. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పరిశుభ్రమైన, పునరుత్పాదక విద్యుత్తు విభాగంలో ఒక పెద్ద అడుగుగా ఈ ప్రాజెక్టును ప్రభుత్వం చూస్తోంది.

Leave a Reply