- షాపింగ్ కాంప్లెక్స్‌కు భారీగా నిధులు…
- విస్తరణ పూర్తయితే నగరం సుందరంగా
- రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్
గోదావరిఖని, ఆంధ్రప్రభ: గోదావరిఖని పట్టణాన్ని వ్యాపార రంగంలో మరింత అభివృద్ధి చేసేందుకే రూ.27 కోట్ల నిధులతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్‌సింగ్ తెలిపారు. మంగళవారం సాయంత్రం గోదావరిఖని పట్టణంలోని ప్రధాన చౌరస్తా ఏరియాలో చేపడుతున్న షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను రామగుండం ఎమ్మెల్యే పరిశీలించారు.
కొనసాగుతున్న షాపింగ్ కాంప్లెక్స్ పనులను ఆయన పర్యవేక్షించారు. సింగరేణి సంస్థ నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు వేగంగా జరగాలని ఆయన సూచించారు.
అదేవిధంగా పనుల నాణ్యతలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పనులు చేపట్టాలని అన్నారు. నాణ్యతలో లోపం వస్తే ఊరుకోబోమన్నారు. అభివృద్ధి పనుల్లో పూర్తిస్థాయిలో పారదర్శకత పాటించాలన్నారు. గోదావరిఖని పట్టణ ప్రజలకు ఆధునిక వాణిజ్య సదుపాయాలు కల్పించడమే ఈ షాపింగ్ కాంప్లెక్స్ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
అనుకున్న మేరకు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు పూర్తి దశకు చేరుకున్నాక ఇక్కడ జరిగే విస్తరణ అభివృద్ధితో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కూడా ఎక్కువగా లభించే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ స్పష్టం చేశారు.
అలాగే నగరంలో డిజైన్ చేసిన విధంగా రోడ్డు విస్తరణ, షాపింగ్ కాంప్లెక్స్‌ల నిర్మాణం, అభివృద్ధి పనులతో గోదావరిఖని ముఖచిత్రం మారిపోతుందని, ఈ ప్రాంతం ప్రధాన నగరాలకు దీటుగా సుందరంగా కనిపిస్తోందని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వివరించారు.
ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు అందించడమే మా ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ తెలిపారు. సింగరేణి, మున్సిపల్ అధికారులతో సమన్వయం కలిగిన విధంగా ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తిచేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు.
ఎమ్మెల్యే వెంట సింగరేణి జీఎం డి. లలిత్‌కుమార్, నాయకులు మహంకాళి స్వామి, సింగరేణి, మున్సిపల్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.