జిల్లాను టాప్ ఫైవ్ లో ఉంచాలి…

జిల్లాను టాప్ ఫైవ్ లో ఉంచాలి…
ప్రతి ఉద్యోగి 24 గంటలు విధుల్లో ఉన్నట్లే…
డేటా ఆధారిత పాలనపై ప్రత్యేక దృష్టి పెట్టండి…
అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి…
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలన్నింటిలోనూ నంద్యాల జిల్లాను టాప్ ఫైవ్ జిల్లాల్లో ఉంచేందుకు అన్ని శాఖలు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి (G.Rajakumari) అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాల్లో అధికారులతో సమీక్షించారు. డీఆర్ఓ రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాల అమలులో డేటా ఆధారిత పాలన కీలక పాత్ర పోషిస్తుందని, అందుకు అనుగుణంగా ప్రతి శాఖాధికారి తమ పనితీరును మెరుగు పరుచుకొని మరింత చురుకుగా పనిచేయాలని సూచించారు. ఈనెల 6వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్వహించిన డేటా ఆధారిత పాలనపై వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా పాల్గొనని కొంతమంది అధికారుల పట్ల కలెక్టర్ అసంతృప్తి (Collector’s displeasure) వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం 20 ముఖ్యాంశాలపై సుధీర్ఘ సమీక్ష (Long review) నిర్వహించిందని తెలిపారు. అధికారులు తమ దృక్పథాన్ని మార్చుకుని పని దిశను మెరుగు పరుచుకోవడంతో పాటు సిబ్బందిని సమర్థంగా సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. ప్రతి కార్యాలయ పనితీరును పరిశీలించేందుకు ట్రాకింగ్ వ్యవస్థను జిల్లా స్థాయిలో అమలు చేస్తామని ఆమె తెలిపారు.
తదుపరి రోజుల్లో జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు పనితీరు ఆధారంగా ర్యాంకింగ్ విధానం అమలు చేయనున్నట్టు కలెక్టర్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ధేశించిన 513 కీలక పనితీరు సూచికల్లో (KPIs) 449 అనుకూల సూచికలు, 64 ప్రతికూల సూచికలు ఉన్నాయన్నారు. వాటి ఆధారంగా ప్రతి శాఖ ప్రగతిని పర్యవేక్షిస్తామని ఆమె వివరించారు. ప్రతి నెల మండల స్థాయిలో 5వ తేదీలోగా, జిల్లా స్థాయిలో 8వ తేదీలోగా సంబంధిత శాఖలు డేటాను నమోదు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ప్రతి శాఖ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలన్నారు. ప్రతి ఫోరంలో, ప్రతి వేదికలో శాఖ ప్రగతిని ప్రజలకు వివరించే అలవాటు కలిగి ఉండాలని సూచించారు. అవసరమైన సందర్భాల్లో ప్రతి ప్రభుత్వ ఉద్యోగి 24 గంటల పాటు పనిచేసేందుకు సిద్ధంగా వుండాలని ఆమె పేర్కొన్నారు. డేటా ఆధారిత పాలన ఇప్పుడు అత్యంత కీలకమైన పరిపాలనా మార్గదర్శకంగా మారిందని, ప్రజలకు సత్వరమైన, సమర్థమైన సేవలు అందించడమే అధికారుల ప్రధాన లక్ష్యం కావాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
