(తిరువూరు, ఆంధ్రప్రభ) : చంద్రబాబు అనుభవం, పవన్ కళ్యాణ్ నిజాయితీ, మోడీ సహకారంతో అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని తిరువూరు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఏపీ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చిన రోజు నేడు అంటూ అభిమానించిన ఆయన ఏడాదిలో ఎన్నో సంక్షేమ పథకాలను, మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసి చూపించామని చెప్పారు. తల్లి, చెల్లితో పాటు నాయకులు, కార్యకర్తలకు వెన్నుపోటు పొడిచిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు.
పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిజమైన వెన్నుపోటుదారులు ఎవరైనా ఉన్నారా అంటే అది వైఎస్ జగన్ మాత్రమేనన్నారు. సొంత పార్టీకి కార్యకర్తలకు కూడా వెన్నుపోటు పొడిచింది జగనే అని చెప్పారు. సరిగ్గా సంవత్సరం క్రితం ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రను మార్చిన రోజు, బాక్స్ బద్ధలైన రోజు ఇది అని తెలిపిన ఆయన కూటమి రూపంలో ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ కు పట్టిన పీడను వదిలించిన రోజు ఇది అని తెలిపారు.
ఐదు సంవత్సరాల్లో జగన్ చేసిన అడ్రస్ లేని అభివృద్ధి ఇప్పుడు ప్రారంభమైందని, అమరావతి పునర్ నిర్మాణం మోడీ చేతుల మీదుగా మరలా పునఃప్రారంభం అయ్యిందన్నారు. ఓ పక్క పరిశ్రమల స్థాపన, ఉద్యోగాలు, పోలవరం వేగంగా సాగుతున్నాయని, ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు, పెన్షన్లు పెంపు, అన్నా క్యాంటీన్లు ఇలా ఎన్నో కార్యక్రమాలను ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం అమలు చేసి చూపించిందని వివరించారు.