అంబేద్కర్ రచించిన రాజ్యాంగం తోనే ఫలాలు..

ఉట్నూర్, ఆంధ్రప్రభ : అన్ని వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శనివారం అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఇంద్రవెల్లిలో నిర్వహించే అంబేద్కర్ జయంతి ఉత్సవాల గోడ ప్రతులను నాయకులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే రిజర్వేషన్ ఫలాలు వచ్చాయని, ఆయన సబ్బండ వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహానేత అని కొనియాడారు.
అతి పెద్ద లిఖితపూర్వక రాజ్యాంగాన్ని మన దేశానికి అందించారని గుర్తు చేశారు. ఏప్రిల్ 14న ఇంద్రవెల్లి మండల కేంద్రంలో నిర్వహించే జయంతి ఉత్సవాలకు జిల్లాలోని విద్యార్థులు మేధావులు, దళిత సంఘాలతో పాటు అన్ని వర్గాల ప్రజలు హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ ముక్కాడే ఉత్తం, అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.
