ఉగాది నాటికి కమిటీలు పూర్తి చేయాలి..

ఉగాది నాటికి కమిటీలు పూర్తి చేయాలి..
పాయికాపురం, ఆంధ్రప్రభ : వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రతీ డివిజన్‌లో కనీసం 350 మందితో ఉగాది నాటికి అన్ని కమిటీలు పూర్తి చేయాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మల్లాది విష్ణు సూచించారు. అజిత్‌సింగ్‌నగర్ ఆంధ్రప్రభ కాలనీ జనహిత సదనంలో కార్పొరేటర్‌లు, వైఎస్సార్‌సీపీ నాయకులతో మల్లాది విష్ణు సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్పొరేటర్‌లు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేసి అన్ని విభాగాలను భర్తీ చేయాలని అన్నారు. పార్టీ సేవలు క్షేత్రస్ధాయికి తీసుకువెళ్ళటంతో పాటు చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని అన్నారు. పని చేసే ప్రతీ ఒక్కరికీ పార్టీలో గుర్తింపు భధ్రత ఉంటుందని అన్నారు. తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు చేస్తున్న ప్రజావ్యతిరేక కార్యక్రమాలను ప్రజలకు చేరేలా చూడాలని సూచించారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి చంద్రబాబు ప్రభుత్వానికి ఉన్న తేడా ప్రజలకు తెలియ చేయాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజలతో కలిసి పోరాటం చేయాలని ఇందుకు పార్టీ అండదండగా ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన డివిజన్ వారీగా సమస్యలు పార్టీ పరిస్ధితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పార్టీ నాయకులు మల్లాది విష్ణును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌లు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
