రెండు వర్గాల ఘర్షణ
- కులపంచాయితీ ఫలితం
- ఇటు కర్రలు కత్తులతో దాడి…
- అటు ఇంటికి నిప్పు
- ఊళ్లో పోలీస్ పికెటింగ్ రెడీ
(నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ ) : అక్రమ సంబంధం .. పచ్చని కాపురాల మధ్య చిచ్చు పెట్టింది. ఈ చిచ్చు ఊరినే కకావికలం చేసింది. ఒక వర్గం కర్రలు, గొడ్డలితో దాడికి ఎగబడితే.. మరో వర్గం ఇంటిని తగులబెట్టింది. తీవ్ర సంచలనం రేపిన ఈ ఘటన నంద్యాల (Nandyal) జిల్లా పెద్ద కొట్టాల (Pedda Kottala) గ్రామంలో చోటు చేసుకుంది. తాలూకా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నంద్యాలకు రెండు కిలోమీటర్ల దూరంలోని పెద్ద కొట్టాల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తన భార్యతో అక్రమ సబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో చిన్నా అనే వ్యక్తిపై రెండు నెలలు కిందట చంటన్న దాడి చేశాడు.
ఈ ఘటనపై గ్రామంలో పెద్దల పంచాయితీ (Panchayat) జరిగింది. కొన్నాళ్లు ఊరు వదిలి వెళ్లాలని చిన్నాను గ్రామపెద్దలు ఆదేశించారు. ఇక తన కుమార్తె పుట్టినరోజు సందర్భంగా గురువారం రాత్రి చిన్నా ఊరికి చేరుకున్నాడు. బంధువులందరినీ ఆహ్వానించాడు. తనను ఊరి నుంచి బయటకు పంపించటానికి చంటన్నే కారణమని చిన్నా తన బంధువుల ఎదుట వాపోయాడు. ఈ స్థితిలో చిన్నా బంధువులు కోపంతో చంటన్న ఇంటిపై కర్రలు, గొడ్డళ్లతో దాడి చేశారు. కాగా చంటన్న బంధువులు కూడా ప్రతిదాడికి దిగారు. చిన్న ఇంటి పై పెట్రోల్ (Petrol) పోసి నిప్పంటించారు.
ఈ విషయాన్ని గ్రామస్తులు పోలీసులకు తెలిపారు. ఫైర్ ఇంజన్ (Fire engine) సకాలంలో చేరకుని మంటలు ఆర్పేసింది. ఇరువురు దాడుల్లో గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారు.