ప్రజల ఆశీర్వాదం కాంగ్రెస్‌కే
- బీఆర్‌ఎస్ రాజకీయ శకం ముగిసింది
- బీఆర్‌ఎస్ దోపిడీని ప్రజలు మర్చిపోలేదు
- ప్రజల మనసు గెలిచింది కాంగ్రెస్ పాలన
- సంక్షేమం, అభివృద్ధి – రెండు కళ్లలాగా పని చేస్తున్నాం
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం ఖాయమని మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. యూసుఫ్‌గూడాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, శివసేన రెడ్డి, గిరిధర్ రెడ్డి, జాన్సీ రెడ్డి తదితర కీలక నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నిర్వహించిన రోడ్‌షోకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ప్రజా పాలనలో సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లలాగా పని చేస్తున్నాయని, రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు ఉచిత విద్యుత్ పొందుతున్నారని తెలిపారు.
నవీన్ యాదవ్ ఒక బీసీ బిడ్డ, విద్యావంతుడు, స్థానికుడు అని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కొందరు నవీన్ యాదవ్ ను బదనాం చేయడానికి ప్రయత్నిస్తున్నారని, అయితే “నవీన్ యాదవ్ పలానా తప్పు చేశాడనే ఆధారం మీ దగ్గర ఉందా? బట్ట కాల్చి మీద వేస్తున్నారు,” అని మండిపడ్డారు.
పదేళ్ల బీఆర్‌ఎస్ దోపిడీ, అరాచక పాలనను ప్రజలు మర్చిపోలేదని, ఆ విషయాలు ప్రజల మదిలో మెదులుతున్నాయని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్‌ఎస్‌కు సున్నా సీట్లు ఇచ్చారంటేనే, రాజకీయంగా వారి శకం ముగిసిందని చెప్పకనే చెప్పారని విమర్శించారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీ పని అయిపోయిందని, టీఆర్‌ఎస్ నుండి బీఆర్‌ఎస్ గా మారినప్పుడే సగం చచ్చిపోయిందని, పార్లమెంట్ ఎన్నికల తరువాత మొత్తం చచ్చిపోయిందని వ్యాఖ్యానించారు.
జూబ్లీహిల్స్‌లో సగానికి ఎక్కువగా ఉన్న బీద ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. గ్రామాల్లో రైతు భరోసా, రైతు రుణమాఫీ పథకాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు 70 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసిందని, కానీ బీఆర్‌ఎస్ 10 ఏళ్లలో ఇచ్చిన ఉద్యోగాలు 20 వేలు కూడా దాటలేదని చెప్పారు.
ప్రజా సంక్షేమం అందిస్తున్న కాంగ్రెస్ పార్టీని జూబ్లీహిల్స్ ప్రజలు ఆదరిస్తారని మహేష్ కుమార్ గౌడ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజల మధ్య ఉండే నాయకుడు, ఫోన్ చేస్తే ఇంటి ముందు వచ్చే నాయకుడు అయిన నవీన్ యాదవ్ గెలుపును ఎవరూ ఆపలేరని, భారీ మెజారిటీతో గెలుస్తారని మహేష్ కుమార్ గౌడ్ నమ్మకంగా చెప్పారు.

