- రూ.153 కోట్లతో పనుల నిర్వహణ
- ఇక బోయింగ్, ఎయిర్ బస్ విమానాలకు అనుకూలం
తిరుపతి, ఆంధ్రప్రభ బ్యూరో (రాయలసీమ) : దేశంలోనే అతిపెద్ద రన్‌వే సిద్ధమైంది. తిరుపతి విమానాశ్రయంలో రూ.153 కోట్లతో రన్ వే విస్తరణ పనులు నేటితో పూర్తయ్యాయి. దీంతో, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) నిర్వహణలో దేశంలోనే ఇదే పెద్ద రన్ వే గా నిలుస్తోంది.
2,285 మీటర్ల నుంచి 3810 మీటర్లకు జరిగిన విస్తరణతో ఇకపై బోయింగ్ 777 విమానాలు, ఎయిర్ బస్ 330 విమానాల రాకపోకలకు తిరుపతి విమానాశ్రయంలో వీలుకలగనున్నది. గత రెండు దశాబ్దాల మధ్య కాలంలో అంచలంచెలుగా ఎదుగుతూ అంతర్జాతీయ విమానాశ్రయం స్థాయికి చేరుకున్న తిరుపతి విమానాశ్రయంలో ఇటీవలే విస్తరణ పనులు మొదలయ్యాయి.
ఇందులోభాగంగా ప్రస్తుతం ఉన్న 2,285 మీటర్ల రన్ వేను విస్తరించడంతో పాటు పలు అనుబంధ సాంకేతిక వ్యవస్థల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం రూ.153 కోట్ల నిధులను కేటాయించింది. దశలవారీగా కొనసాగిన పనుల్లో భాగంగా ప్రస్తుతమున్న 2285 మీటర్ల పొడవు గల రన్‌వేను బలోపేతం కావడంతో పాటు, ఇరువైపులా వరుసగా 240 మీటర్లు, 1285 మీటర్లు మేరకు పొడిగింపు జరిగింది.
ఇందులో భాగంగానే ట్రాన్స్-ఇన్స్టాల్డ్ ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ (ఐఎల్ఎస్), కొత్త డాప్లర్ వెరీ హై ఫ్రీక్వెన్సీ ఓమ్ని రేంజ్ (డివీఒఆర్ ) డిస్టెన్స్ మెజరింగ్ ఎక్విప్మెంట్ (డిఎంఇ) కమిషనింగ్ పూర్తి అయింది. దీంతో ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ ( ఐఎల్ఎస్): థాలెస్ ఐ ఎల్ ఎస్, కేట్-1 రూ.4.4 కోట్ల అంచనా వ్యయంతో ట్రాన్స్-ఇన్స్టాల్ చేశారు దీని వల్ల కనీస దృశ్యమానత అవసరం 1500 మీటర్ల నుండి 700 మీటర్లకు తగ్గుతుంది.
అన్ని వాతావరణ పరిస్థితులలో విమానాలు సజావుగా దిగడానికి వీలుగా గ్లైడ్ యాంగిల్ కూడా 3.2 డిగ్రీల నుండి 3 డిగ్రీలకు తగ్గించగలరని విమానాశ్రయ డైరెక్టర్ శ్రీనివాసరావు మన్నే తెలిపారు. ఈ పనులతో గరిష్ట విమానాల నిర్వహణ సామర్థ్యం రోజుకు 100 విమానాల నుంచి 200 విమానాలకు పెరుగుతుందన్నారు.
అన్ని ప్రాజెక్టులలో మొత్తం ఖర్చు రూ. 153.16 కోట్లు. కాగా కొత్తగా అందుబాటులోకి వచ్చిన సౌకర్యాలు విమానాశ్రయ పనితీరును మెరుగుపరుస్తాయని చెప్పారు. రన్ వే పొడవును 3, 810 మీటర్లకు పెంచడంతో ఇకపై బోయింగ్ 777, ఎయిర్‌బస్ 330 వంటి విశాల విమానాలు తిరుపతి విమానాశ్రయంలో విజయవంతంగా దిగగలవు.
అన్నిటిని మించి దేశంలో ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న విమానాశ్రయాలలన్నిటిలో అతి పెద్ద రన్ వే కలిగిన విమానాశ్రయం గా తిరుపతి ఎయిర్ పోర్ట్ పేరొందడం చెప్పుకోదగిన విశేషం.