చేనేత రంగం అభివృద్ధే ధ్యేయం
శ్రీ సత్యసాయి బ్యూరో, ఆగస్టు 7 (ఆంధ్రప్రభ): వారసత్వ సంపదగా నిలిచిన చేనేత రంగాన్ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఆరోగ్య సంక్షేమ శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ (Satyakumar Yadav), జిల్లా కలెక్టర్ టి.ఎస్.చేతన్ (T.S.Chetan) లు సంయుక్తంగా పేర్కొన్నారు. గురువారం ధర్మవరంలోని కదిరి గేటు వద్ద ఉన్న నేతన్న విగ్రహం సమీపంలో 11వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రి సత్యకుమార్ యాదవ్, జిల్లా కలెక్టర్ టి.ఎస్.చేతన్ లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… చేనేత కేవలం జీవనోపాధి మాత్రమే కాకుండా మన సంస్కృతికి, మన ప్రత్యేకతకు నిదర్శనమన్నారు. ఇటువంటి గొప్ప రంగాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని ప్రభుత్వం (Government) సంకల్పించిందని చెప్పారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా చేనేత రంగాన్ని కేంద్ర స్థాయిలో గుర్తించి, 2015, ఆగష్టు 7వ తేదీన చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం జాతీయ చేనేత దినోత్సవం (National Handloom Day) గా పాటించాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో, ఈ రోజు 11వ జాతీయ చేనేత దినోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించుకుంటున్నామన్నారు. ప్రభుత్వం ప్రతి అర్హులైన చేనేత కుటుంబానికి నేరుగా రూ.25,000లు చెల్లిస్తుందని చెప్పారు. అలాగే జీఎస్టీ భారం నుంచి చేనేతలను విముక్తం చేయాలని నిర్ణయించి, 5% జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందన్నారు.
రా మెటీరియల్ సప్లై స్కీమ్ (Raw Material Supply Scheme) కింద గత ఆర్థిక సంవత్సరంలో రూ.164 కోట్లు చెల్లించగా, అందులో రూ.25 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించినట్టు వెల్లడించారు. అలాగే మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ (Mega Handloom Cluster) ను ధర్మవరంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఈ క్రమంలో మార్కెట్ యార్డులో 10ఎకరాల స్థలాన్ని గుర్తించి, త్వరలో భూమిపూజ నిర్వహించనున్నట్టు తెలిపారు. ధర్మవరం పట్టణంలో నీటి సమస్యలు, అధిక లోడ్ సమస్యలపై చర్యలు తీసుకుంటూ, విద్యుత్ శాఖతో సంప్రదించి ప్రత్యేకంగా డీపీఆర్ సిద్ధం చేశారని.. రూ.110కోట్ల వ్యయంతో కొత్త విద్యుత్ ప్రాజెక్టుకు అనుమతి పొందే దిశగా కృషి జరుగుతోందన్నారు. ఇది పూర్తయితే ధర్మవరంలో మగ్గాలకు ఎటువంటి విద్యుత్ లోపం ఉండదన్నారు.
జిల్లా కలెక్టర్ టి.ఎస్.చేతన్ మాట్లాడుతూ… చేనేత కేవలం జీవనోపాధి కాదు, భారత సంస్కృతిని ప్రతిభింభించే ప్రతీక లాంటి వృత్తి అని పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం (Agricultural sector) తర్వాత చేనేత రంగం అత్యధిక జనాభాకు ఉపాధి కల్పిస్తూ దేశంలోని మొత్తం వస్త్ర ఉత్పత్తిలో 19% భాగస్వామ్యం కలిగియున్నదన్నారు. ప్రపంచం అన్ని రంగాల్లో వేగంగా మారుతున్న నేపథ్యంలో చేనేత రంగం కూడా సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి అనేక కష్టాలు పడే వారని, నేడు ఆన్‌లైన్ మార్కెట్లు (Online markets), డిజిటల్ పోర్టల్స్ (Digital portals), ప్రభుత్వ వేదికలు వంటి అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ మార్పులను అంగీకరించి, తరం నుండి తరం వరకు నైపుణ్యాన్ని కొనసాగించడమే కాకుండా, ఆదాయాన్ని పెంపొందించే దిశగా చేనేత కుటుంబాలు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.
11వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా “చేనేత డిజైనింగ్” నందు జాతీయ అవార్డ్ అందుకున్న జిల్లా చేనేత డిజైనర్ జే.నాగరాజును మంత్రి సత్యకుమార్ యాదవ్, జిల్లా కలెక్టర్ టి.ఎస్.చేతన్ లు అభినందించారు. టీడీపీ ఇంచార్జి పరిటాల శ్రీరామ్ (TDP in-charge Paritala Sriram), జనసేన స్టేట్ జనరల్ సెక్రటరీ చిలకం మధుసూదన్ రెడ్డి (Jana Sena State General Secretary Chilakam Madhusudhan Reddy) లు నేతన్నల సంక్షేమాభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈసందర్భంగా ఉత్తమ చేనేత కార్మికులైన కాంతమ్మ, ఆంజనేయులు, ఈశ్వరయ్య, రామకృష్ణ తదితరులను ఘనంగా వారు సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముందుగా ముఖ్య అతిధులు నేతన్న విగ్రహానికి పూలమాలలు వేసి నమస్కరించారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం టీడీపీ ఇంచార్జి పరిటాల శ్రీరామ్, జనసేన స్టేట్ జనరల్ సెక్రటరీ చిలకం మధుసూదన్ రెడ్డి, చేనేత జౌళి శాఖ అడిషనల్ డైరెక్టర్ మురళి కృష్ణ, జాయింట్ డైరెక్టర్ కన్నబాబు, ఆర్డీవో మహేష్, మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.