ఆ గూడెంను ఐటీడీఏలో చేర్చాలి..
ఏపీ గిరిజన సమాఖ్య డిమాండ్..
కలెక్టర్ కు ఐటీడీఏ అధికారికి వినతి పత్రం..
నంద్యాల బ్యూరో, నవంబర్ 4 ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా (Nandyal District) లోని మహానంది మండలం అబ్బి పురం గ్రామం చెంచు గూడెం ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదని చిన్నపాటి వర్షానికి గూడమంతా నీరు నిండిపోతుందని వారిని ఆదుకోవాలని గిరిజన సమాఖ్య నాయకులు మంగళవారం జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చారు. గిరిజన తాండ గ్రామంలో పక్కా గృహాలు రోడ్లు వీధి కాలువలు లాంటి మౌలిక వసతులు కల్పించి ఐటీడీఏలో చేర్చాలని ఏపీ గిరిజన సమాఖ్య జిల్లా సమితి ఆధ్వర్యంలో కలెక్టర్ రాజ కుమారి గణియాకు డిమాండ్ తో కూడిన వినతిపత్రం ఇచ్చారు.
ఏపీ గిరిజన సమాఖ్య జిల్లా అధ్యక్షలు కాలింగి రాముడు జిల్లా ప్రధాన కార్యదర్శి మోటా రాముడు, జిల్లా నాయకులు తుపాకుల వెంకటేశ్వర్లు, లక్ష్మయ్య అంజి లు మాట్లాడారు. మహానంది మండలం అబ్బిపురం గ్రామంలో 42 చెంచు కుటుంబాలు ప్రభుత్వ భూమిలో ప్రభుత్వం ఇచ్చిన పట్టాలతో పూరిపాకలు వేసుకొని జీవనం సాగిస్తున్నారన్నారు. దశాబ్దాలు గడుస్తున్నా అభివృద్ధికి నోచుకోవడంలో వెనుకబడిపోయిందన్నారు. కనీసం వారికి రోడ్డు, వీధి కాలువలు గృహాలు లేకపోవడంతో వర్షాకాలంలో వరద నీరులో బిక్కు బిక్కు మని జీవిస్తున్నారన్నారు. ఎండాకాలంలో పాములు, తేళ్ల వంటి విషపురుగులకు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీ నాయకులు తూతూ మంత్రంలా చెంచు ప్రజలను కలుస్తూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ఉత్తుత్తి హామీలతో కాలం వెల్లబుచ్చారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ జిల్లాలోని అనేక చెంచు గూడేలను అభివృద్ధి పరిచారన్నారు. అబ్బిపురం చెంచు కాలనీ కూడా ఐటీడీఏలో చేర్చి మౌలిక వసతులు కల్పించాలని కోరారు. జిల్లా కలెక్టర్ అధికారులను పిలిపించారు. అబ్బిపురం చెంచు గూడెంలో పక్కా గృహాలు వీధి కాలవలు, రోడ్లు, వీధిలైట్లు, కల్పించేందుకు చొరవ చూపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

