అదే మా మొదటి ప్రాధాన్యత..

అదే మా మొదటి ప్రాధాన్యత..
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మున్సిపాలిటీలో మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్నట్లుగా మున్సిపల్ చైర్ పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ తెలిపారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 20 వార్డులలో వార్డు కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ‘ప్రజా పాలన’ సభలు నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి నివేదిక’ 99 రోజుల ప్రణాళికలో భాగంగా కౌన్సిలర్లు ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
వార్డు సభల్లో కౌన్సిలర్లు మాట్లాడుతూ.. తమ వార్డుల అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. పట్టణ పారిశుధ్యం మొదలుకొని, మౌలిక సదుపాయాల కల్పన వరకు అన్ని పనులను వేగవంతం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్లు, వృద్ధాప్య, ఇతర పెన్షన్ల కోసం ప్రజల నుండి పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయని, వాటిని త్వరితగతిన పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ సభల్లో మున్సిపల్ చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, కమిషనర్ జి. వెంకటరామిరెడ్డి పాల్గొని కౌన్సిలర్లకు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. కౌన్సిలర్ల నేతృత్వంలో విద్యుత్, ఆరోగ్య, ఇతర శాఖల అధికారులు ప్రజల సమస్యలను రికార్డు చేసుకున్నారు.
కౌన్సిలర్లు తమ వార్డులోని ప్రతి వీధి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, అక్కడికక్కడే కొన్ని సమస్యలకు పరిష్కారమార్గాలను సూచించారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య కౌన్సిలర్లు వారధిలా పని చేస్తున్నారు. పార్టీలకతీతంగా, అర్హతే ప్రామాణికంగా ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి చేరవేయడమే మా లక్ష్యం” అని ఈ సందర్భంగా కౌన్సిలర్లు స్పష్టం చేశారు. తమ వార్డుల పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజీ, వీధి దీపాలు, తాగునీటి సమస్యల పై ప్రత్యేక నివేదికలు సిద్ధం చేసి పరిష్కరిస్తామని వారు ప్రజలకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మొగుదాల పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమాలలో మున్సిపాలిటీకి చెందిన 20 వార్డుల కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, వార్డు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
