TGSRTC | యూనియ‌న్ల పేరుతో అస‌త్య ఆరోప‌ణ‌లు..

  • దుష్ప్ర‌చారాన్ని తీవ్రంగా ఖండించిన యాజ‌మాన్యం

యూనియన్ల పేరుతో కొందరు అసత్య ఆరోపణలు చేస్తోన్న విషయం త‌మ దృష్టికి వచ్చిందని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంది. కొంతకాలంగా తమ మనుగడ కోసం ఇష్టారీతిన మాట్లాడుతూ, ప్రకటనలు జారీ చేస్తూ ఆర్టీసీ ఉద్యోగులను గందరగోళానికి గురిచేస్తున్నారని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం మండిప‌డింది.

తాజాగా ఎస్ఆర్డీఎస్ ను టీజీఎస్ఆర్టీసీ సంస్థ రద్దు చేస్తోందంటూ ఉద్యోగులను తప్పుదారి పట్టించి, రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని టిఎస్ఆర్టిసి ప్రజా సంబంధాల అధికారులు తెలిపారు. సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా ఉద్దేశపూర్వకంగా చేస్తోన్న ఈ దుష్ప్రచారాన్ని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండిస్తోందని యాజమాన్యం తెలిపింది.

ఎంతో కాలం సంస్థపై ఆధారపడి జీవించి.. పదవీవిరమణ చేసిన తర్వాత బయటకు వెళ్లి టీజీఎస్ఆర్టీసీ ప్రతిష్ఠకు భంగం కలిగించే నిరాధారమైన ఆరోపణలు చేయడం తగదు. ఇప్పటికైనా సంస్థపై దుష్ప్రచారాన్ని మానుకోవాలని యాజమాన్యం హితవు పలుకుతోంది. తమ మనుగడ కోసం కొందరు ఉద్దేశపూర్వకంగా చేస్తోన్న ఆరోపణలను నమ్మి ఆందోళనకు గురికావొద్దని ఉద్యోగులకు విజ్ఞప్తి చేస్తోంది.

ఉద్యోగుల సంక్షేమానికి యాజమాన్యం కట్టుబడి ఉందని, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పెండింగ్ అంశాలను త్వరలోనే పరిష్కారం అవుతాయని, ఎలాంటి గందరగోళానికి గురికావొద్దని స్పష్టం చేస్తోంది.

గత మూడున్నరేళ్లుగా సంస్థలో సంక్షేమ పరంగా ఎలాంటి సంస్కరణలను యాజమాన్యం తీసుకువచ్చిందో ఉద్యోగులకు తెలుసు. యూనియన్ లీడర్లు అవేం పట్టించుకోకుండా రోజుకో ప్రకటనను జారీ చేస్తూ ఉద్యోగులను తప్పుదారి పట్టించే విధంగా వ్యవహారించడం మంచి పద్దతి కాదు.

యూనియన్ లీడర్లమంటూ కొందరు చేస్తోన్న తప్పుడు ప్రచారాన్ని, పుకార్లని నమ్మి ఆందోళనకు గురికావొద్దని ఉద్యోగులకు యాజమాన్యం విజ్ఞప్తి చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *