యాదాద్రి జిల్లా కలెక్టర్ ఇంటి తలుపు తట్టే కార్యక్రమంతో వెలుగులు
విద్యార్ది భరత్ చంద్ర ఇంటికి కలెక్టర్ మరోసారి
టెన్త్ డిస్ట్రిక్షన్ లో పాస్ కావడంతో అభినందనలు
తల్లికి సత్కారం.. ఆర్థిక సాయం
యాదాద్రి – జీవితంలో స్థిరపడే వరకు సహాయం అందిస్తానని తాను దత్తత తీసుకున్న 10వ తరగతి విద్యార్థి కుటుంబానికి యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు భరోసానిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం శేరిగూడెం గ్రామానికి చెందిన భరత్ చంద్ర చారి ఇంటికి జిల్లా కలెక్టర్ నేడు స్వయంగా వెళ్లారు.
ఇది ఇలా ఉంటే పదవ తరగతిలో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేకంగా రూపొందించిన తెల్లవారుజామునే విద్యార్థి ఇంటి తలుపు తట్టే కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ శేరిగూడం గ్రామానికి చెందిన భరత్ చంద్ర చారి ఇంటికి ఈ ఏడాది జనవరిలో వెళ్లిన విషయం తెలిసింది. ఆ సమయంలో భరత్ చంద్ర చారి కుటుంబ పరిస్థితిని చూసి చలించిన జిల్లా కలెక్టర్ పదో తరగతి పూర్తయ్యే వరకు తాను సాయం అందిస్తానని బాగా చదివి మంచి మార్కులు సాధించాలని ప్రోత్సహించారు.

తాజాగా ప్రకటించిన పదవ తరగతి ఫలితాల్లో భరత్ చంద్ర చారి 73% మార్కులు సాధించడంతో స్వయంగా జిల్లా కలెక్టర్ ఇంటికి వచ్చి భరత్ చంద్ర, ఆయన తల్లి విజయలక్ష్మిలను సన్మానించారు. ఈ సందర్భంగా నెలకు సరిపడా నిత్యావసర సరుకులతో పాటు అయిదు వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. అదే విధంగా భవిష్యత్తులో భరత్ అనుకున్న లక్ష్యం సాధించే వరకు తాను అండగా ఉంటానని భరోసానిచ్చారు. ఏ అవసరమున్నా తనను సంప్రదించవచ్చునని ఆయన భరత్ కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఈ
సందర్భంగా భరత్ చంద్ర ఆయన తల్లి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ కు తాము జీవితాంతం రుణపడి ఉంటామని ఆయన సహకారంతోనే పదో తరగతి పరీక్షల్లో తన కుమారుడు మంచి మార్కులు సాధించాడని విద్యార్థి తల్లి తెలిపారు