ప్రజలు అనేక సమస్యలతో మన వద్దకు వస్తుంటారు.. వాటిని పరిష్కరించడం మన బాధ్యతగా ప్రభుత్వ ఉద్యోగులు మరీ ముఖ్యంగా అధికారులు భావించాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌గారు అన్నారు.
పౌర కేంద్రీకృత పాలనలో ప్రజావాణి, ప్రజాపాలన పాత్ర అనే అంశంపై మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ(ఎంసీఆర్ హెచ్ ఆర్ డీ) లో బుధవారం జరిగిన ఒక్కరోజు చర్చా కార్యక్రమంలో హైడ్రా కమిషనర్ ఏవీరంగనాథ్ పాల్గొని పలు అంశాలను ప్రస్తావించారు.
ప్రజల సమస్యలన్నీ దాదాపు సంప్రదింపులతో.. సరైన సూచనలతో పరిష్కారం అవుతాయని.. కేవలం 20 శాతం మాత్రమే జఠిలంగా ఉంటాయన్నారు. అందుకే ప్రజల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పెద్దపీట వేశారని తెలిపారు. ఈ క్రమంలోనే ప్రజాపాలన , ప్రజావాణికి ప్రాధాన్యతనిచ్చారని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి, ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారిణి దివ్య దేవరాజన్ ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారని, వారికి అభినందనలు తెలుపుతున్నామని ఆయన అన్నారు.
పరిపాలన విధానం ఎలా ఉంది, సమస్యలపై కింది స్థాయి అధికారుల స్పందన ఇలా.. ప్రజల పల్స్ తెలుసుకోడానికి ప్రజావాణి ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
అందుకే హైడ్రా ప్రజావాణిని చాలా సీరియస్‌గా తీసుకుందని…. ప్రతి సోమవారం దీనిని ఒక ముఖ్యమైన కార్యక్రమంగా భావిస్తూ.. ప్రజలతో నేరుగా మాట్లాడి సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తామని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ ఎ.వి.రంగనాథ్.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా హైడ్రా ప్రజావాణి నిర్వహిస్తున్న విధానం, పరిష్కరించబడిన సమస్యలు. ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరించారు.