TG – హైడ్రా చీఫ్ రంగనాథ్ కృషితో బతుకమ్మ కుంటలో జలధార …
హైదరాబాద్, బతుకమ్మ కుంట బతికే ఉంది. మోకాలు లోతు మట్టి తీయగానే బిరబిరా గంగమ్మ బయటకొచ్చింది. ఇక అంతే అక్కడి స్థానికులలో ఆనందం పెల్లుబికింది. బతుకమ్మ కుంట కాదు.. ఇది మా స్థలమంటూ ఇప్పటివరకూ నమ్మబలికిన వారు ఇప్పుడేమంటారు అని అక్కడి స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
మహానగరంలో చెరువుల పునరుద్ధరణకు నడుం బిగించిన హైడ్రా ( ఆ దిశగా చర్యలను ముమ్మరం చేసింది. అంబర్‌పేటలోని బతుకమ్మకుంటలో పునరుద్దరణ పనులను మొదలుపెట్టగా.. మోకాలిలోతు తవ్వగానే నీరు ఉబికివచ్చింది. దీంతో హైడ్రా అధికారులతోపాటు స్థానికులు ఆశ్చర్యం వ్యక్తంచేశారు. బతుకమ్మకుంట మళ్లీ ప్రాణం పోసుకుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ పుష్పాలతో స్వాగతించారు. హైడ్రా తవ్వకాల్లో పైపులైన్ పగలడం వల్లే నీరు బయటికి వస్తోందని ప్రచారం జరగ్గా .. జలమండలి అధికారులు అక్కడికి చేరుకొని పరిశీలించారు. ఎలాంటి పైపులైన్ లేదని, పూర్తిగా భూగర్భంలో నుంచి వచ్చిన నీళ్లేనని నిర్ధరించారు.
కబ్జాల చెరలో చెరువు ఆనవాళ్లను కోల్పోయిన చెరువుకు ప్రాణం పోయమని స్థానికులు హైడ్రాను ఆశ్రయించిన విషయం విధితమే. ఈ మేరకు అక్కడి ముల్ల పొదలను తొలగించి… తవ్వకాలు చేపట్టిన హైడ్రాకు గంగమ్మ స్వాగతం పలికింది.
మంగళవారం మోకాలు లోతు మట్టిని తీయగానే గంగమ్మ ఉబికి వచ్చింది. దశాబ్దాలుగా నింపిన మట్టిని మొత్తం తొలగిస్తే చెరువు కళకళలాడుతుందని స్థానికులు చెబుతున్నారు.
సుమారు 16 ఎకరాల విస్తీర్ణంలో ఉండాల్సిన బతుకమ్మ కుంట ఆక్రమణల కారణంగా ఐదు ఎకరాలకు కుచించుకుపోయింది. చెరువు పరిరక్షణ కోసం హైడ్రా న్యాయస్థానంలో కూడా పోరాటం చేయాల్సి వచ్చింది. అయితే బతుకమ్మ కుంట స్థలం తనదంటూ స్థానిక నాయకుడు ఎడ్ల సుధాకర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా.. కింది కోర్టుకు వెళ్లాలని సూచించిన విషయం విధితమేఎట్టకేలకు రెవెన్యూ, నీటిపారుదలశాఖ అధికారులు ఇచ్చిన ఆధారాలతో ఇటీవల బతుకమ్మకుంట పరిధిని నిర్ధరించారు. హైకోర్టు ఆదేశాలతో హైడ్రా.. చెరువు పునరుద్ధరణ పనులు చేపట్టింది
చెరువు చరిత్ర ఇది.
* అంబర్‌పేట మండలం, బాగ్అంబర్‌పేట్‌లోని సర్వే నంబరు 563లో 1962 -63 లెక్కల ప్రకారం మొత్తం 14.06 ఎకరాల విస్తీర్ణంలో బతుకమ్మ కుంట.
* బఫర్ జోన్‌తో కలిపి మొత్తం వైశాల్యం 16.13 ఎకరాల విస్తీర్ణం అని తేల్చిన సర్వే అధికారులు.
* తాజా సర్వే ప్రకారం అక్కడ మిగిలిన భూమి కేవలం 5.15 ఎకరాల విస్తీర్ణం మాత్రమే.
* ప్రస్తుతం మిగిలి ఉన్న 5.15 ఎకరాల విస్తీర్ణంలోనే బతుకమ్మ కుంటను పునరుద్ధరించేందుకు హైడ్రా చర్యలు.
* ప్రస్తుతం అక్కడ నివాసం ఉంటున్న వారికి ఎలాంటి ముప్పు లేకుండా చెరువు తవ్వకానికి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌గారి ఆదేశాలు.
* ఒకప్పటి ఎర్రకుంటనే.. కాలక్రమంలో బతుకమ్మ కుంటగా మారిందన్న స్థానికులు. రెవెన్యూ రికార్డులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి.
* కాలక్రమంలో బతుకమ్మకుంటలో చెత్త, నిర్మాణ వ్యర్థాలు పోయడంతో చెరువు ఆనవాళ్లు కోల్పోయిందన్న స్థానికులు.
* బతుకమ్మ కుంట చుట్టూ సుందరీకరణ పనులు చేపట్టనున్న హైడ్రా.
బతుకమ్మ కుంటలో నీటితో కళకళలాడితే పరిసర ప్రాంతల్లో పర్యావరణం, భూగర్భ జలాల పెరుగుదలతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడనుంది.
బతుకమ్మ కుంటలో తిరిగి జల సిరులు తీసుకు వచ్చిన హైడ్రా చీఫ్ రంగనాథ్ కు ఈ ప్రాంతవాసులు కృతజ్ఞతలు తెలిపారు.
https://twitter.com/Comm_HYDRAA/status/1891860221200347465?t=Yq-Qn0HDkBr2CQM2GgMhJQ&s=19