ఆందోళన చేస్తున్నవారిపై దురుసుగా ప్రవర్తించవద్దు
సంయమనం పాటించండి.. పోలీసులకు భట్టి ఆదేశం
లాఠీ చార్జీ జరగడం విచారకరం.
ఎట్టి పరిస్థితులలోనూ వర్శిటీ భూమిని తీసుకోం
ఢిల్లీలో మీడియా సమావేశంలో భట్టి వెల్లడి
న్యూ ఢిల్లీ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేస్తామని తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. వర్సిటీలో విద్యార్థులపై పోలీసులు దుందుడుకుగా వ్యవహరించవద్దని సూచనలు చేశారు అలాగే, హెచ్‌సీయూకు సంబంధించిన ఇంచు భూమిని కూడా ప్రభుత్వం తీసుకోదని స్పష్టం చేశారు.
ఢిల్లీలో నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, విద్యార్థులపై లాఠీ ఛార్జీ జరగడం విచారకరమన్నారు.. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై అనుచితంగా వ్యవహరించవదని పోలీసులను ఆయన ఆదేశించారు.. ఆర్ఎస్ఎస్ భావజాలంతో అక్కడున్న విద్యార్థులను కొందరు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.
గతంలో చంద్రబాబు బిల్లి రావుకు అప్పనంగా 400 ఎకరాలు కట్టబెట్టారన్నారు. . భారత్ ఐఎంజీ బోగస్ కంపెనీ అని నాటి ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆ భూములను రద్దు చేసి ప్రభుత్వ ఆస్తులను కాపాడారని గుర్తు చేశారు. ఆ వెంటనే భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకోకుండా, ప్రైవేటు వారికి లాభం కలిగేలా ఉపేక్షించిందని ఆరోపించారు.
ప్రైవేటు వారికే ఆ భూములు కట్టబెట్టేలా బీఆర్ఎస్ పని చేసిందన్నారు. తాము అధికారంలోకి రాగానే హైకోర్టు, సుప్రీంకోర్టులో పోరాటం చేసి 400 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోగలిగామన్నారు.. ఆ భూములతో హైటెక్ సిటీ ప్రాజెక్టును విస్తరించి ఐటీ కంపెనీలకు అప్పగిస్తామని తేల్చి చెప్పారు… హెచ్‌సీయూకు సంబంధించిన ఇంచు భూమిని కూడా మేము తీసుకోబోమని భట్టి అన్నారు. పర్యావరణాన్ని, జీవజాలాన్ని కాపాడుతామని అన్నారు.. అభివృద్ధి కోసమే భూములను వినియోగిస్తామని చెప్పారు. గతంలో హెచ్‌సీయూ నుంచి తీసుకున్నభూములకు అప్పడే వేరే భూమిని ఇచ్చామన్నారు భట్టి.