రాష్ట్రవ్యాప్తంగా రాబోయే భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రానున్న మూడు రోజులు (ఆగస్టు 13 నుంచి 15 వరకు) భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో…. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

మంగళవారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం, ఉన్నతాధికారులు, కలెక్టర్లను అప్రమత్తం చేశారు. రాబోయే 72 గంటలపాటు అధికారులు, సిబ్బంది సెలవులు రద్దు చేసి 24 గంటలు అందుబాటులో ఉండాలని సూచించారు.

లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అత్యవసర చర్యలు

గ్రేటర్ హైదరాబాద్, రూరల్ ప్రాంతాల కోసం టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ నియంత్రణకు సివిల్ పోలీసుల సహకారం పొందాలని ఆదేశించారు. పాఠశాలలు, కాలేజీలకు సెలవు విషయాన్ని స్థానిక పరిస్థితులపై ఆధారపడి నిర్ణయించుకోవాలని సూచించారు. ఐటీ సంస్థలతో సమన్వయం చేసి వీలైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేయాలని స్పష్టం చేశారు.

అన్ని శాఖల సమన్వయం, విపత్తు నిర్వహణ సన్నాహాలు..

విద్యుత్ అంతరాయాలు ఎదురైనా వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్లు, జనరేటర్లు సిద్ధంగా ఉంచాలని చెప్పారు. తాగునీరు, డ్రైనేజీ సమస్యలు రాకుండా చూడాలని, ఆరోగ్య శాఖ అత్యవసర ఔషధాలు, సౌకర్యాలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల వద్ద నీటి ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లోపై పూర్తి సమీక్ష ఉండాలని సూచించారు.

ఎలాంటి శాఖ “మా పరిధిలో లేదు” అని చెప్పకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని సీఎం స్పష్టం చేశారు. అవసరమైతే సీనియర్ అధికారులను ప్రత్యేకంగా నియమించుకోవాలని, ఎన్డీఆర్‌ఎఫ్‌తో ఎప్పటికప్పుడు సమన్వయం కొనసాగించాలని చెప్పారు.

Leave a Reply