TG | నినాదాలను చట్టాలుగా తీసుకొస్తున్నాం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

మహబూబ్‌నగర్, ఆంధ్రప్రభ : తెలంగాణ గడ్డపై దశాబ్దాలుగా ఉన్న దున్నేవానికి భూమి నినాదాన్ని ఇందిరా సౌర గిరి జిల్లా వికాసం వంటి పథకాల ద్వారా చట్టాలుగా అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. తెలంగాణ గడ్డపై ఉన్న జల్, జంగల్, జమీన్, భూమి కోసం, భుక్తి కోసం పోరాటం వంటి నినాదాలు చట్టాలుగా మారాలంటే రాష్ట్రంలో మరో 20 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండాలి అన్నారు.
ఈరోజు రేవంత్ రెడ్డి నాయకత్వంలో తీసుకువచ్చిన నల్లమల డిక్లరేషన్‌తో రాష్ట్రంలోని అన్ని గిరిజన ప్రాంతాలకు ప్రయోజనం చేకూరుతుందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. నల్లమల డిక్లరేషన్‌ను తూచా తప్పక పాటించి నాలుగు సంవత్సరాల్లో ఈ రాష్ట్ర గిరిజనులకు ఫలితాలు అందిస్తాం అన్నారు. రాష్ట్ర ప్రజల పైన అపారమైన ప్రేమ తరతరాలుగా వెనుకబడ్డ బిడ్డలకు మేలు చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనతో నల్లమల డిక్లరేషన్ ప్రకటిస్తున్నట్టు తెలిపారు. ఏమి పొందలేక దూరంగా ఉన్న గిరిజన బిడ్డలకు 12,600 కోట్లతో పథకాన్ని ప్రారంభించడం ఓ గొప్ప సాహసంగా డిప్యూటీ సీఎం అభివర్ణించారు.జూన్ 2న గిరిజన యువతకు రాజీవ్ యువ వికాసం స్వయం ఉపాధి పథకం ద్వారా 1000 కోట్లు మంజూరు చేయబోతున్నట్టు ప్రకటించారు.
