TG | ఆదివాసీ బిడ్డ జోలికి వ‌స్తే నాశ‌న‌మైపోతావ్‌! – కెటిఆర్ కు సీతక్క శాపనార్ధాలు

ములుగులో న‌డిచేది ప్ర‌జాస్వామ్య ప్ర‌జాపాల‌న‌
సొంత చెల్లిని చూసి ఓర్వ‌లేని స్థాయిలో కేటీఆర్ అహంకారం
పోలీసు రాజ్య‌మంటూ ఇబ్బందుల‌కు గురి చేయ‌డం స‌రికాదు
గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో మా కార్య‌క‌ర్త‌ల‌ను వేధించ‌డం నిజం కాదా?

ములుగు జిల్లా ప్ర‌తినిధి, ఆంధ్ర‌ప్ర‌భ : త‌న‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, (brs working president ) మాజీ మంత్రి, సిరిసిల్ల (siricilla ) ఎమ్మెల్యే కేటీఆర్ (mla ktr ) చేసిన ఆరోప‌ణ‌లు అవాస్త‌మ‌ని రాష్ట్ర పంచాయ‌తీ రాజ్ శాఖ మంత్రి ధ‌న‌స‌రి అన‌సూయ ( సీత‌క్క‌) (sittakka ) అన్నారు. ములుగు లో మంగ‌ళ‌వారం నాడు మీడియాతో ఆమె మాట్లాడారు. వాస్త‌వ విష‌యాలు తీసుకుని బ‌హిరంగ చ‌ర్చ‌కు రావాల‌ని కేటీఆర్‌కు పిలుపునిచ్చారు. ములుగు జిల్లాలో ప్రజాపాలన సాఫీగా జరుగుతుంటే ఓర్వలేని బీఆర్ఎస్ నాయకులు నిరసన పేరుతో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో సీతక్కకు ఉన్న ప్రతిష్టతను దెబ్బ‌తియ్యాల‌న్న‌ దురుద్దేశంతో కేటీఆర్ త‌న దండును పంపి జిల్లాలో డ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు.

ములుగులో పోలీసు రాజ్యం అనేది అస‌త్య ప్ర‌చారం
ములుగు జిల్లాలో పోలీసు రాజ్యం నడుస్తుందంటూ అసత్య ప్ర‌చారం చేస్తున్నార‌ని సీత‌క్క అన్నారు. అబద్దాల పునాదుల మీద పుట్టి పెరిగిన కేటీఆర్ కు స‌వాల్ చేస్తున్నాన‌ని, బీఆర్ఎస్ పాల‌న‌లో ఎన్ని డ‌బుల్ బెడ్ రూములు ఇచ్చారో తేల్చి చెప్పాల‌న్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి విడతలోని ములుగు నియోజకవర్గంలో ఐదువేల ఇండ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. 2023 డిసెంబర్ నుంచి 2025 జూలై వరకు బీఆర్ఎస్ నాయకుల పై ఎన్ని కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ లు నమోదు చేశామో వాస్తవాలతో చర్చకు రావాలని కేటీఆర్ కు సవాల్ విసిరారు. గత పదేండ్ల బీఆర్ఎస్‌ పాలనలో కాంగ్రెస్ కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చర్చకు వస్తే తేల్చుకుందామని అన్నారు.

బీఆర్ఎస్ నాయ‌కులు ఏం సాధించారు?
ప్రైవేట్ కంపెనీలతో మోసపోయిన 950 మంది రైతులకు దాదాపుగా రూ. 4 కోట్ల నష్ట పరిహారాన్ని ఇవ్వడానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు వస్తున్న క్రమంలో మంత్రుల కాన్వాయిని అడ్డుకొని బీఆర్ఎస్ నాయకులు ఏం సాధించారని మంత్రి సీత‌క్క ప్ర‌శ్నించారు. గత ఎన్నికల్లో త‌న‌ను ఓడించడానికి కల్వకుంట్ల కుటుంబం ఎన్ని కుట్రలు చేసినా, ప్రజలు తనకే పట్టం కట్టారని అన్నారు. గత ప‌దేళ్ల‌ తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం పరిపాలించిందని 1200 మంది విద్యార్థుల త్యాగాల పునాదుల పైన గద్దెనెక్కి దొరల పాలనను కొనసాగించారని అన్నారు. మల్లంపల్లి ప్రత్యేక మండలం కోసం ప్రజలు నిరసన తెలిపితే ముందస్తు అరెస్టుల పేరుతో వారిని ఇబ్బందులకు గురి చేసింది కేటీఆర్ కాదా అని ప్రశ్నించారు.

ఆదివాసీ బిడ్డ‌నైన త‌న‌పై చేస్తున్న ఆరోప‌ణ‌ల‌ను నిరూపించాలి
ఆదివాసి బిడ్డనైన తనపై చేస్తున్న ఆరోపణలను నిరూపించాలని సీత‌క్క‌ సవాల్ విసిరారు. కేటీఆర్ మీ ప్రభుత్వ హయంలో సిరిసిల్ల గజ్వేలు , కరీంనగర్, నర్సంపేట, కొత్తగూడెంలో అమాయక ప్రజల ఆత్మహత్యలు, న్యాయవాదులను సైతం హత్య చేయించిన చరిత్ర ప్రజలందరికీ తెలుసన‌ని అన్నారు. ఆదివాసీ బిడ్డనైన త‌న‌తో పెట్టుకుంటే కేటీఆర్ నాశమై పోతార‌ని అన్నారు. ఇకనైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలని, వాస్తవాలను ప్రజలకు తెలియపరచాలని అన్నారు. సొంత చెల్లిని చూసి ఓర్వలేని కేటీఆర్ అని అన్నారు. ములుగు జిల్లాను అభివృద్ధి చేస్తుంటే చూసి ఓర్వలేని బీఆర్ఎస్ నాయకులు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ప్రతి నిరుపేదకు విడతల వారీగా ఇండ్లను అందజేస్తామని అన్నారు.

Leave a Reply