TG | రోశ‌య్య‌పై మ‌మ‌కారం! ఇక అఫిషియల్ గా మాజీ సీఎం జ‌యంతి వేడుక‌లు

తెలంగాణలో జులై 4న అధికారిక జయంతి
ఉత్తర్వులు జారీచేసిన రేవంత్ స‌ర్కార్‌
లక్డీకాపూల్ చౌరస్తాలో విగ్రహం ఏర్పాటు
రోశయ్య స్ట్రీట్‌గా ధరమ్ కరమ్ ఏరియాకు నామ‌క‌ర‌ణం
నేచర్ క్యూర్ ఆసుపత్రి పేరు కూడా మార్పు
తెలంగాణ ప్ర‌భుత్వంలో అరుదైన గౌరవం

సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ : ఉమ్మ‌డి ఎపిలో 16 సార్లు ఆర్ధిక మంత్రిగా (Finance Minister ).. ప్రజాపద్దుల శిల్పిగా.. శాసన సభలో (assembly) ప్రతిపక్షం (opposition ) పాలిట వికట కవిగా… సర్కారుకు గొంతు పెగలని ప్రశ్నలు సంధించే రాజకీయ దురంధరుడుగా.. శాంతి ప్రవచనలతో మృదుస్వభావిగా.. మాటల తూటాల జడివానతో.. మహోగ్ర పదాల రుధిర ధారతో.. ప్రత్యర్థి రాజకీయ నేతల గుండెల్లో జల్లు సృష్టించే.. కొణిజేటి రోశయ్య (Konijeti Rosaiah ) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం పాత్రలోనూ ఈ పల్నాడు బిడ్డ ఎక్కడా తగ్గలేదు. అందుకే.. అరుదైన గౌరవంతో తెలంగాణ ప్రభుత్వం కొణిజేటి రోశయ్యను నేటి తరాలకు యాది చేస్తోంది. ఆయన జయంతి వేడుకలను(Birth anniversary ) తెలంగాణలో అధికారికంగా నిర్వహించాలని అన్ని జిల్లాల అధికారులను ఆదేశించింది.

సమైక్య ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్య‌మంత్ర‌లుగా పనిచేసిన ఏ ఒక్కరికీ రోశయ్యకు లభించిన గౌరవం దక్కలేదు. జులై 4వ తేదీని రోశయ్య జయంతిగా నిర్వహించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఉత్తర్వులు కూడా జారీచేసింది. జులై 4వ తేదీ రోశయ్య జన్మదినంగా ప్రకటిస్తూ ప్రభుత్వం సమున్నత గౌరవాన్ని అందించింది. కాగా, ఇప్పటి వరకు పనిచేసిన కొందరు ముఖ్యమంత్రుల జన్మదినాలను జయంతిగా రాజకీయ పార్టీలే జరుపుతున్నాయి. మరికొందరి జయంతిని కుటుంబ సభ్యులు లేదా అభిమానులు జరుపుతున్నారు. అలాంటిది రోశయ్య జయంతిని అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించటం కచ్చితంగా అరుదైన గౌరవం అవుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ..

మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతిని అన్ని జిల్లాల్లో ఘనంగా జరిపేందుకు కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ పర్యవేక్షణలో జయంతి ఉత్సవాలు రాష్ట్రమంతా జరగనున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్ధికశాఖ మంత్రిగా 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత కూడా రోశయ్యకే దక్కుతుంది. హైదరాబాద్​లోని ధరమ్ కరమ్ ఏరియాలో మాజీ సీఎం కొణిజేటి రోశయ్య నివసించారు. అందుకని ఈ ఏరియాలోని ఒక వీధికి రోశయ్య పేరు పెట్టాలని గ్రేటర్ మున్సిపల్ అధికారులను సీఎం ఆదేశించారు. ఆయన ఇంటికి దగ్గరలోని నేచర్ క్యూర్ ఆసుపత్రికి రోశయ్య పేరును ప్రభుత్వం ప్రతిపాదించింది. లక్డీకాపూల్ చౌరస్తాలో రోశయ్య విగ్రహాన్నీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.

అందరికీ సన్నిహితుడే..

కాంగ్రెస్​ సీనియర్​ లీడర్​ కొణిజేటి రోశయ్య సుమారు 50 ఏళ్లు రాజకీయాల్లో యాక్టివ్​గా ఉన్నారు. వివాద రహితుడిగా పేరు పొందారు. అన్నీ పార్టీల్లోను అత్యంత సన్నిహితులున్నారు. ప్రతిపక్షాల్లోని నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రులను ఎంతగా విమర్శించినా, ఆరోపణలు చేసినా రోశయ్య విషయంలో మాత్రం ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడేవారు. సమైక్య రాష్ట్రంలో ఏపీకి సీఎంగా రాజీనామా చేసిన తర్వాత తమిళనాడు గవర్నర్​గా కూడా పనిచేశారు. సమైక్య ఆంధ్రప్రదేశ్​లో పార్టీ అధ్యక్షుడిగా అంతకుముందు అధికార ప్రతినిధిగా కూడా పనిచేశారు. నిజానికి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏపీ ప్రభుత్వం తీసుకోవాలి. కానీ, ఆయన కాంగ్రెస్ నేత కావటంతో ఈ నిర్ణయం తీసుకోలేకపవోచ్చని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

Leave a Reply