TG | బీజేపీ, బీఆర్ఎస్ ఢిల్లీలో దోస్తీ- గల్లీలో కుస్తీ : మంత్రి పొన్నం

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభ జులై నాలుగో తేదీన జ‌రుగుతుంద‌ని, ఈ స‌భ్య‌ను విజ‌య‌వంతం చేయాల‌ని రాష్ట్ర బీసీ సంక్షేమం, ర‌వాణా శాఖ‌, హైద‌రాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి జన సమీకరణ చేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం గాంధీభ‌వ‌న్‌లో హైద‌రాబాద్ జిల్లా కాంగ్రెస్ నేత‌ల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. అంత‌కుముందు మీడియాతో మాట్లాడారు. పార్టీ కోసం కష్టపడిన వారికి ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. దేవాలయ కమిటీలు, మార్కెట్ కమిటీలు ఖాళీగా ఉన్న ఇతర ఏ నామినేటెడ్ పదవులు త్వరలోనే భర్తీ పూర్తవుతుందన్నారు.

ఆ రెండు పార్టీలు దోస్తులు
బీజేపీ, బీఆర్ఎస్‌ పార్టీలు ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీలాగా వ్యవహరిస్తున్నాయని మంత్రి పొన్నం అన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం మీరు ఏం చేశారని, బాధ్యతారహితంగా వ్యహరించినందుకు మీకు ప్రజలు సున్నా సీట్లు ఇచ్చారని విమర్శించారు. రాబోయే కాలంలో మిమ్మల్ని ప్రజలు కనుమరుగు చేస్తారని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష బాధ్యతలు వదిలి.. శత్రుదేశంగా సొంత రాష్ట్రానికి నష్టం కలిగేలా చేస్తున్నారని మండిపడ్డారు. పక్క రాష్ట్రంలో రాష్ట్రానికి ఏమైనా సమస్య వస్తే అన్నీ పార్టీలు కలిసి వస్తాయన్నారు. తెలంగాణలో కూడా ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి రావాలని పిలుపునిచ్చారు.

ప్ర‌భుత్వాన్ని అస్థిరప‌రిచే కుట్ర‌
తెలంగాణలో ప్రజా పాలన ప్రభుత్వం నెల రోజుల్లోపు పడిపోతుందని శాపనార్ధాలు పెడుతున్నారని, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తున్నార‌ని మంత్రి పొన్నం ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తూ ప్రజల సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోతుంటే.. ఉద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తోందని ఆరోపించారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని, ఆర్థిక సంక్షోభం ఉన్న తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఆచరణలో చూపెడుతుందన్నారు. ప్రభుత్వం, పార్టీ సమన్వయం చేసుకోవాలని, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ప్రథమ వర్ధంతి సందర్భంగా గాంధీ భవన్‌లో ఆయన చిత్రపటానికి మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ వి.హనుమంతరావు తదితర నేతలు నివాళులర్పించారు.

Leave a Reply