వెలగపూడి – త్వరలో క్యూఆర్ కోడ్‌తో రేషన్ కార్డులు అందరికీ ఇస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. అలాగే రేషన్ బియ్యం పక్కదారి పట్టుకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై శాసన సభలో నేడు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ, గత ప్రభుత్వం వ్యవస్థీకృతంగా పీడీఎస్ రైస్ అంటే స్మగ్లింగ్ రైస్‌గా మార్చేశారన్నారు. ఇలా మార్చిన ఘనత జగన్ దేనంటూ ఆరోపించారు. ప్రస్తుతం అక్రమ రవాణా అరికట్టడానికి సివిల్ సప్లైస్ చట్టాలు, పీడీ యాక్టులలో సవరణలు తెచ్చి చట్టాలలో మార్పులు తెచ్చామన్నారు.
‘రేషన్ బియ్యం కేజీకి 46.10 రూపాయలు ఖర్చు చేస్తున్నాం. 32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పీడీఎస్ రైస్ కోసం వినియోగిస్తున్నాము. కాకినాడ పోర్టులో 50 వేల మెట్రిక్ టన్నులు సీజ్ చేసి.. 25 మెట్రిక్ టన్నులు పీడీఎస్ రైస్‌గా గుర్తించాం. త్వరలో క్యూఆర్ కోడ్‌తో రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం. ఈకేవైసీ, ఏఐ కెమెరాల సహాయంతో అక్రమ రవాణాను అరికట్టే ప్రయత్నాలు చేస్తున్నాం’ అని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు.
‘గత ఐదేళ్ల కాలంలో రేషన్ బియ్యానికి సంబంధించిన లెక్కలు తీస్తున్నాం. పూర్తి వివరాలు రావాల్సిన అవసరం ఉంది. మచిలీపట్నం గోడౌన్లతో పాటు రాష్ట్రంలో కాకినాడ, బేతంచర్ల గోడౌన్లకు సంబంధించి తనిఖీలు జరుగుతున్నాయి. మచిలీపట్నం జెఎస్ వేర్ హౌస్లో తనిఖీ జరిగింది. వారి దగ్గర నుంచి ఇప్పటికే కోటి 70 లక్షల వరకు రికవరీ జరిగింది. ఇంకా అధికారులు విచారణ చేస్తున్నారు. సభ్యలు అడిగిన అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకుంటాం. త్వరలో అన్ని విషయాలు బయటికి వస్తాయి’ అని మంత్రి నాదెండ్ల పేర్కొన్నారు.