యాసంగి ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై కలెక్టర్లు, పౌరసరఫరాలశాఖ ముఖ్య అధికారులతో కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి కొనుగోళ్లను పర్యవేక్షించాలని ఆదేశించారు.
ఈ ఏడాది యాసంగిలో రికార్డు స్థాయిలో 127.50 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే ఛాన్స్ ఉందన్నారు. వానకాలం, యాసంగి కలిపి 281 లక్షల టన్నుల దిగుబడి వచ్చే అవకాశముందని అని చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా 8329 కొనుగోలు కేంద్రాల ద్వారా 70.13 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్ణయించారన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ధాన్యం సేకరణకు ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు మంత్రి ఉత్తమ్ కుమార్ సూచించారు.