హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని అనుమానాస్పదంగా మృతిచెందిన ఘటనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. గురుకులాలను కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం చేయడం పట్ల మండిపడ్డారు. గురుకులాల్లో మోగుతున్న విద్యార్థుల మరణమృదంగాన్ని ఆపడం చేతకాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చివరికి కనీస మానవత్వం కూడా లేదని తేలిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసమర్థ కాంగ్రెస్ సర్కారు వల్ల ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలకేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో లాలిత్య చక్రం అనే మరో తొమ్మిదో తరగతి విద్యార్థిని అనుమానాస్పదంగా మృతిచెందడం తీవ్ర దిగ్భ్రాంతికరమని అన్నారు. .
ప్రభుత్వ తీరు దారణం
కళ్ల ముందు విగతజీవిగా పడి ఉన్న బిడ్డ మృతదేహం చూసి గుండెలు పగిలిన తల్లిదండ్రులను ఓదార్చాల్సింది పోయి, పుట్టెడు దుఖంలో ఉన్న తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం అత్యంత దుర్మార్గమని కేటీఆర్ మండిపడ్డారు. రోజురోజుకూ ప్రజల దృష్టిలో దిగజారిపోవడమే కాకుండా, కనికరం కూడా లేకుండా పోయిన కాంగ్రెస్ సర్కారు తీరును చూసి విద్యార్థుల తల్లిదండ్రులే కాదు, రాష్ట్ర ప్రజలు కూడా అసహ్యించుకుంటున్నారని అన్నారు. ఈ దాష్టీకానికి విద్యాశాఖ మంత్రిగా విఫలమై, హోంమంత్రిగా కూడా అట్టర్ ఫ్లాప్ అయిన ముఖ్యమంత్రిదే పూర్తి బాధ్యత అని స్పష్టం చేశారు. కేవలం 14 నెలల వ్యవధిలోనే ఒక రాష్ట్రంలోని గురుకులాల్లో 83 మంది విద్యార్థులు బలికావడం భారత దేశ చరిత్రలోనే ఓ చీకటి అధ్యాయని పేర్కొన్నారు.