TG | తెలంగాణ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలు..

  • ఉద్యోగుల డీఏ పెంపు,
  • రోడ్ల అభివృద్ధి,
  • మెట్రో విస్తరణకు భారీ నిధుల కేటాయింపు

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పదవీవిరమించిన ఉద్యోగులకు శుభవార్త. ఈరోజు జ‌రిగిన కేబినెట్ మీటింగ్ లో రేవంత్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల నేపథ్యంలో ఉద్యోగులకు రెండు విడతల డీఏ (డియర్‌నెస్ అలౌయెన్స్) పెంపును మంజూరు చేసింది. ఇదే కాక, రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేసింది. దాంతో, హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2Bకు కూడా ఆమోదం తెలిపింది.

రెండు విడతల డీఏ పెంపు – బకాయిలు 28 ఇన్స్టాల్మెంట్ లో చెల్లింపు

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పదవీవిరమించిన ఉద్యోగులకు రెండు డీఏ (డియర్‌నెస్ అలౌయెన్స్) పెంపుల‌ను మంజూరు చేసింది. ఈ పెంపుల్లో ఒకటి తక్షణమే అమల్లోకి రానుండ‌గా.. రెండవ డీఏ పెంపు వచ్చే ఏడాది ఏప్రిల్‌లో అమలు చేయనున్నారు. 2023 జనవరి 1 నుంచి పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను 28 వాయిదాలలో చెల్లించనున్నారు.

ఉద్యోగుల డిమాండ్లపై క్యాబినెట్ చర్చ

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన, ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల వివరాలు క్యాబినెట్‌కి తెలియజేశారు. ఉద్యోగుల 57 డిమాండ్లను మే 6న ఏర్పాటైన అధికారుల కమిటీ సమీక్షించి నివేదిక సమర్పించింది. వాటిలో పలు డిమాండ్లను ఆమోదించగా, మిగతావాటిపై మరింత సమీక్షకు తీర్మానం చేయడం జరిగింది.

ఉద్యోగుల బకాయిలు చెల్లింపును వ్యవస్థబద్ధంగా అమలు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రతి నెలా రూ.700 కోట్ల చొప్పున బకాయిల చెల్లింపులు జరపనుంది.

హెల్త్ కేర్ ట్రస్ట్, ఆరోగ్య కార్డుల జారీ

ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రత్యేకంగా హెల్త్ కేర్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో అధికారులు, సంఘ ప్రతినిధులు ట్రస్టీలుగా ఉంటారు. ఈ ట్రస్ట్ ద్వారా ఆరోగ్య కార్డులు జారీ చేయనున్నారు.

పదోన్నతుల కోసం సెప్టెంబర్‌లో DPCలు

ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌లో డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే, రాష్ట్ర స్థాయి వైద్య అంగవైకల్య కమిటీని కూడా ఏర్పాటు చేయనున్నారు. జాయింట్ స్టేట్ కౌన్సిల్, ఇతర ఉద్యోగ సంఘాలకు గుర్తింపు ఇవ్వనున్నారు. GO 317 పరిధిలో కొత్త కేటగిరీలను చేర్చనున్నారు.

డా. మన్మోహన్ సింగ్ పేరుతో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ

ఖమ్మం జిల్లా కొతగూడెంలో ఉన్న తెలంగాణ ఎర్త్ సైన్సెస్ యూనివర్శిటీకి భారత మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్ పేరును పెట్టనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల అభివృద్ధికి రూ.33,194 కోట్లు

హైబ్రిడ్ అన్నుయిటీ మోడల్ (HAM) ద్వారా 13,137 కి.మీ రోడ్ల అభివృద్ధి చేయనున్నారు. ఇందులో 7,947 కి.మీ పంచాయతీరాజ్ రోడ్లకు రూ.16,780 కోట్లు, 5,190 కి.మీ ఆర్&బి రోడ్లకు రూ.16,414 కోట్లు ఖర్చు చేయనున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాలు లేదా గత జిల్లాల ఆధారంగా రోడ్ ప్యాకేజీలు రూపొందించనున్నారు. నిర్మాణానికి రెండు సంవత్సరాలు, నిర్వహణకు 15 సంవత్సరాల పాటు బాధ్యత వహించాల్సి ఉంటుంది.

మెట్రో ఫేజ్ 2Bకు ఆమోదం – రూ.19,579 కోట్లు వ్యయం

హైదరాబాద్ మెట్రో ఫేజ్–2B విస్తరణకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇది మొత్తం 86.1 కి.మీ పొడవున సాగనుంది. ప్రాజెక్ట్‌ మొత్తం వ్యయం రూ.19,579 కోట్లు ఉండగా, కేంద్ర–రాష్ట్ర భాగస్వామ్యంతో ఈ మెట్రో విస్తరణను చేపట్టనున్నారు.

Leave a Reply