TG | అబద్ధాలతో అభివృద్ధిని కనుమరుగు చేయలేరు – కాంగ్రెస్ సర్కార్ పై కెసిఆర్ విసుర్లు

ఎర్రవల్లి – తెలంగాణ పురోగతితెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సమయంలో నీళ్లు, నిధులు, నియామకాలపై తీసుకున్న స్పష్టమైన ప్రణాళికలతోనే అద్భుత ఫలితాలను సాధించామని మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. ఆర్‌బిఐ వంటి సంస్థలు కూడా తెలంగాణ అభివృద్ధిని ప్రశంసిస్తూ ప్రస్తావిస్తున్నాయని ఆయన చెప్పారు. తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఉన్నప్పటికీ అతి తక్కువ సమయంలోనే అన్ని రంగాల్లో ప్రగతి సాధించినట్లు, ఆర్‌బిఐ నివేదికలో స్పష్టంగా పేర్కొనబడిందని కేసీఆర్ వెల్లడించారు.

ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో నేడు జరిగిన కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా, జూలూరు గౌరీశంకర్ సంపాదకత్వంలో వెలువడిన “వందేళ్ళ ముందుచూపు” పుస్తకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా, కేసీఆర్ మాట్లాడుతూ, తెలంగాణను తిరిగి సస్యశ్యామలం చేసి, ఎగువ భూములకు సాగునీరు అందించామన్నారు. పూడిపోయిన చెరువులను తవ్వి భవిష్యత్ తరాలకు నీటి భద్రత కల్పించామన్నారు.ప్రతి గ్రామానికి తాగునీరు అందించటం, ప్రజలకు హామీలు ఇచ్చినంత మాత్రాన కాకుండా, అంతకుమించి సేవలను అందించే ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ మాత్రమే అని కేసీఆర్ అన్నారు.

చీకట్లో మగ్గిన తెలంగాణకు 24 గంటల విద్యుత్ సరఫరా సాధ్యం చేసి, దేశానికి ఆదర్శంగా నిలిచినట్లు చెప్పారు.రైతుబంధు పథకం దేశానికే ఆదర్శమని, తెలంగాణను ధాన్యాగారంగా మార్చినట్లు అన్నారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ప్రతీకగా తెలంగాణ అభివృద్ధిని చూపిస్తున్నట్లు పేర్కొన్న కేసీఆర్, 10 ఏళ్లలోనే దేశానికి మోడల్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దామని, ఆర్‌బిఐ నివేదిక ద్వారా ఈ విషయాన్ని వెల్లడించినట్లు చెప్పారు.

తెలంగాణ సమాజానికి ఈ విషయం బాగా తెలుసు, అబద్ధాలు నిలబడవని, సాధించిన ప్రగతిని ఎవరూ తక్కువ చేసి చూపలేరని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధితో పాటు గంగాజమున తహజీబ్ సంస్కృతిని కూడా కాపాడుకుంటున్నామని కేసీఆర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, వి. ప్రకాష్, మాజీ హోంమంత్రి మహ్మూద్ అలీ, పుస్తక రచయిత జూలూరు గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *