హైదరాబాద్, ఆంధ్రప్రభ : మహాత్మా జ్యోతిబా పూలే స్ఫూర్తి ప్రదాత అని, ఆయన స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం పూలే జయంత్యుత్సవం సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సామాజిక ఉద్యమాలకు మార్గదర్శిగా, బహుజన చైతన్య దీప్తిగా నిలిచి వివక్షలపై పోరాడి, మహిళా విద్యకు విశేష కృషి చేశారని గుర్తు చేశారు. పూలే స్ఫూర్తితోనే సామాజిక సాధికారత కోసం తెలంగాణలోని ప్రజా ప్రభుత్వం తీసుకున్న సమగ్ర కుల గణన, బీసీలకు 42 శాతం కోటా రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ వంటి సామాజిక న్యాయ సాధికారత నిర్ణయాలు తీసుకున్నట్లు సీఎం చెప్పారు.
స్టాచ్యూ కోసం స్థల పరిశీలన
మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహం ఏర్పాటు విషయంలో తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసింది. ఆయన జయంతి రోజే హైదరాబాద్ నెక్లెస్ రోడ్ ఐమాక్స్ సమీపంలో ఆయన విగ్రహ ఏర్పాటుకు సీఎం రేవంత్‌రెడ్డి స్థలాన్ని పరిశీలించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, పలువురు ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, బీసీ సంఘాల నేతలు జాజుల శ్రీనివాస్‌గౌడ్, తదితరులతో కలిసి సీఎం స్థలాన్ని పరిశీలించారు. స్టాచ్యూ స్థలం కోసం సర్వే చేసి పూర్తిస్థాయి ప్రణాళికలతో నివేదికను అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. భవిష్యత్‌లో ట్రాఫిక్ తదితర సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని డిజైనింగ్ రూపకల్పన చేయాలని చేయాలని సూచించారు.
సామాజిక న్యాయానికి దిశానిర్దేశం చేసిన మహనీయుడు – భట్టి
సామాజిక న్యాయం కోసం పెద్ద ఎత్తున పోరాటం చేసి, ఆ వర్గాలకు దిశా నిర్దేశం చేసిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కొనియాడారు. శుక్రవారం యూసఫ్ గూడ సమీపంలోని సీడీఎస్ కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి నివాళులు అర్పించిన అనంతరం డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడారు. దేశంలోని అనేకమంది వెనుకబడిన వర్గాలు ప్రధానంగా మహిళలకు సామాజిక న్యాయం జరగాలని జ్యోతిరావు పూలే పెద్ద ఎత్తున పోరాటం చేశారని గుర్తు చేశారు. సమాజంలో బడుగు బలహీన వర్గాల కోసం పనిచేయాలన్న ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరు పూలే జయంతి సందర్భంగా మరోసారి ఆ వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేయాలని కోరారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను పూలే గురువుగా భావించి వారి సిద్ధాంతాలను ఆచరణలో పెట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్, సీడీఎస్ నిర్వాహకులు మల్లేపల్లి లక్ష్మయ్య, సీనియర్ జర్నలిస్టు రామచంద్ర మూర్తి తదితరులు పాల్గొన్నారు.