హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి అంటూ ఫైర్ అయ్యారు బిఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు. ఎల్లప్పుడూ అబద్ధాలు మాట్లాడారు కాబట్టి ఆయన అబద్దాల రేవంత్ రెడ్డి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు..మాజీ మంత్రి హరీశ్ రావు నేతృత్వంలోని బీఆర్‌ఎస్ బృందం ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాద స్థలాన్ని పరిశీలించేందుకు బయలుదేరారు..ఆయన బృందంలో ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ జిల్లాలకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులున్నారు. బయలుదేరే ముందు హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ఘటన స్థలానికి వెళ్లి బాధిత కుటుంబాలను ఓదార్చి వారికి అండగా ఉంటామన్నారు. అలాగే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పరిశీలించి తమ వంతు సహాయ సహాకారాలు అందజేస్తామన్నారు. త్వరతగతిన చర్యలు తీసుకోవడానికి మా సూచనలు అందజేయాలనే సదుద్దేశంతో బీఆర్‌ఎస్ బృందం వెళ్తుందన్నారు.
ఇక ఈ ప్రమాద సహాయ కార్యక్రమాల నిర్వహణలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్నారు. ఏజెన్సీల మధ్య సమన్వయం చేయడంలో కూడా ప్రభుత్వం వైఫల్యం కనపడుతుందన్నారు.. ఘటన జరిగి ఆరు రోజులైనా సహాయక చర్యలు మొదలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు ఇంటర్వ్యూలు ఇవ్వడంలో పోటీ పడుతున్నారని అంటూ హెలికాప్టర్ నుండి సొరంగంలో ఏం జరుగుతుందో తెలుస్తుందా? అని ప్రశ్నించారు. ఎంత తొందరగా సహాయక చర్యలు మొదలైతే అంత ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
ప్రమాదం జరగడం దురదృష్టకరమని అన్నారు హరీశ్ రావు. టన్నెల్ లో చిక్కుకున్న ఎనిమిది మంది ప్రాణాలు కాపాడటం కంటే ముఖ్యమంత్రికి ఎన్నికలు ముఖ్యమయ్యాయని మండి పడ్డారు. సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం, ముఖ్యమంత్రి సరైన డైరెక్షన్ ఇవ్వలేకపొతున్నారని పేర్కొన్నారు.. ప్రభుత్వ ఫెయిల్యూర్ కప్పి పుచ్చుకోవడానికి తమపై నెపం నెడుతున్నారు హరీశ్ రావు.ఇక ఎస్ ఎల్ బి సి కోసం కాంగ్రెస్ హయాంలో కంటే బీఆర్ఎస్ హయంలోనే ఎక్కువ నిధులు ఖర్చు చేశామని వివరించారు.. అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి 100 కోట్ల మోబిలైజేశన్ ఫండ్ ఇచ్చామని గుర్తు చేశారు. ఇక రేవంత్ రెడ్డి 15 నెలల పాలనలో 15 మీటర్లు కూడా సొరంగాన్ని తవ్వలేదని అన్నారు.