హైదరాబాద్ – ఢిల్లీకి 42 సార్లు వెళ్లినా సాధించింది గుండు సున్నా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు.. ఈ మేరకు ఆయన ఎక్స్ ఖాతాలో ట్విట్ చేశారు.. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ జరిగిందంటూ పేర్కొన్నారు.. తెలంగాణకు జరిగే నష్టంపై నోరు మెదపకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. మరోవైపు ఉపాధి హామీ కూలీలకు నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని.. వారి జీవితాలతో ఆడుకుంటుందని మండిపడ్డారు.
ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం, మరోవైపు కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని హరీశ్ రావు ఆరోపించారు. రాష్ట్రానికి మంజూరైనా నరేగా పనిదినాలను కేంద్ర ప్రభుత్వం సగానికి తగ్గించడం శోచనీయమని అన్నారు. 2024-25లో రూ.12.22 కోట్ల పనిదినాలు మంజూరు చేయగా, ఈ సంవత్సరం కేవలం రూ. 6.5 కోట్ల పనిదినాలకే పరిమితం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీకి చెరో 8 మంది ఎంపీలు ఉన్నా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే నరేగా పనిదినాలు పెంచాలని డిమాండ్ చేశారు..