TG| నేడు కాళేశ్వరం కమిషన్ విచారణకు ఈటల రాజేందర్

హైదరాబాద్ | కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంతో, ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలున్నాయని, డిజైన్‌లో తప్పులున్నాయని, అంచనాలు పెంచేశారని, భారీగా అవినీతి జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం మార్చి 2024లో ఒక జుడిషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఏకసభ్య కమిషన్‌గా ఏర్పాటు చేయబడిన దీనికి మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ అధిపతిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విచారణను కాళేశ్వరం కమిషన్ ఇన్వెస్టిగేషన్‌ను స్పీడప్ చేసింది.కాళేశ్వరం కమిషన్ తుది విచారణలో భాగంగా మాజీ ఆర్థిక మంత్రి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ శుక్రవారం జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ కమిషన్ ఎదుట హాజరుకానున్నారు.

ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్న ఈటల రాజేందర్ బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక మంత్రిగా పని చేశారు. కార్పొరేషర్ ఏర్పాటుతో పాటు, ప్రాజెక్టుకు సంబంధించిన పలు కమిటీలను ఈటల లీడ్ చేశారనే ప్రచారం ఉంది. ఆర్థికపరమైన నిర్ణయాల కమిటీలకు నేతృత్వం వహించడమే కాకుండా.. కొన్ని కమిటీల్లోనూ ఈటల రాజేందర్ సభ్యుడిగా ఉన్నారని వాదనలు ఉన్నాయి.

ఈ అంశాలపై కాళేశ్వరం కమిషన్ ఈటల రాజేందర్‌ను విచారించనుంది. దీంతో ఈటల రాజేందర్ ఏం చెప్తారు అనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈటల రాజేందర్ చెప్పే సమాధానాల ఆధారంగా జస్టిస్ పీసీ ఘోష్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు.

అదే విధంగా ఈనెల 9న మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు, 11న మాజీ సీఎం కేసీఆర్.. విచారణకు హాజరుకానున్నారు. ఈ మేరకు వారికి ఇప్పటికే కమిషన్ నుంచి నోటీసులు జారీ అయ్యాయి. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణ సమయంలో ఈ ముగ్గురు కీలక బాధ్యతల్లో ఉన్నారు. దీంతో వారిని విచారించాలని కమిషన్ నిర్ణయించింది.

కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో భాగంగా ఇప్పటివరకు దాదాపు 100 మందికి పైగా అధికారులను కమిషన్ విచారించింది. వారు చెప్పిన అంశాలు, వాటికి సంబంధించిన ఆధారాల ఆధారంగా ఈ ముగ్గురిని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.

Leave a Reply