తెలంగాణలో రాబోయే 50 సంవత్సరాల అవసరాలను తీర్చడానికితగినట్లుగా రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్లు, ఇతర రోడ్లు, జంక్షన్లు వాటి మధ్య కనెక్టివిటీని నిర్మించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగం అలైన్‌మెంట్‌ను సమీక్షించిన ముఖ్యమంత్రి, పలు మార్పులను సూచించారు.
రీజనల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్ల నిర్మాణంతో పాటు ఇతర అంశాలపై రోడ్లు, భవనాలు శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సంబంధిత శాఖ అధికారులతో జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి సమీక్షించారు.
ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం అలైన్‌మెంట్‌కు సంబంధించి అటవీ ప్రాంతం, జల వనరులు, మండల కేంద్రాలు, గ్రామాల విషయంలో ముందుగానే లైడర్ సర్వే చేపట్టాలని సీఎం ఆదేశించారు. అలైన్‌మెంట్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎటువంటి పొరపాట్లకు తావివ్వరాదని స్పష్టం చేశారు.
శాటిలైట్ టౌన్‌షిప్‌లు, పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు అనుగుణంగా రేడియల్ రోడ్లకు రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు అనుసంధానం చేసే రేడియల్ రోడ్ల నిర్మాణం ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు.
హైదరాబాద్ నుంచి వెళ్లే జాతీయ, రాష్ట్ర రహదారులు ఆర్ఆర్ఆర్ వెలుపలికి వెళ్లే ప్రాంతంలో తగు రీతిలో ట్రంపెట్స్ నిర్మించాలని, ఎటువంటి గందరగోళానికి తావులేకుండా, ట్రాఫిక్ సిగ్నల్స్ లేకుండా దాటేలా చూడాలని సీఎం అధికారులకు తెలిపారు.
హైదరాబాద్ – శ్రీశైలం జాతీయ రహదారిలో ఎలివేటెడ్ కారిడార్, నూతన అలైన్‌మెంట్‌కు సంబంధించి ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. రాజీవ్ రహదారికి ప్రత్యామ్నాయంగా ఓఆర్ఆర్ నుంచి మంచిర్యాల వరకు నూతన రహదారి నిర్మాణానికి సంబంధించి ప్రత్యామ్నాయ అలైన్‌మెంట్‌ను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఆ మార్గంలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలను పరిశీలించాలన్నారు. ఈ నూతన రహదారులకు సంబంధించి జాతీయ రహదారుల శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు.