హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ వేదికగా జరిగిన “తెలంగాణ క్రీడా సదస్సు”లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమైన ప్రకటన చేశారు. ఈ కార్యక్రమంలో ‘తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ – 2025’ను అధికారికంగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “తెలంగాణ యువత ప్రపంచ స్థాయిలో పోటీ పడాల్సిన అవసరం ఉంది. సరైన స్పోర్ట్స్ పాలసీ లేకపోవడం వల్లే యువత మాదకద్రవ్యాల వంటి వ్యసనాల్లో చిక్కుకుంటోంది” అని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుందని సీఎం స్పష్టం చేశారు.

స్పోర్ట్స్ పాలసీలో కీలక అంశాలు..

ఈ స్పోర్ట్స్ పాలసీ పీపీపీ (పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) మోడల్‌లో రూపుదిద్దుకుందన్నారు. దేశ, రాష్ట్ర స్థాయిలో మెడల్స్ సాధించిన క్రీడాకారులు, స్పోర్ట్స్ యూనివర్సిటీలు నడిపిన అనుభవజ్ఞులు, కార్పొరేట్ రంగ నిపుణులతో కూడిన ప్రత్యేక తెలంగాణ స్పోర్ట్స్ బోర్డు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

“పాత మైదానాలు పెళ్లిళ్లకు వేదికలుగా మారిపోయిన దుస్థితికి ఇక ముగింపు ఉంటుంది. స్పష్టమైన యాక్షన్ ప్లాన్‌తో స్పోర్ట్స్ యూనివర్సిటీలు, అకాడమీలు ఏర్పాటు చేస్తాం” అని ప్రకటించారు. ఇప్పటికే తెలంగాణ రైజింగ్ – 2047 విజన్ డాక్యుమెంట్ లో క్రీడల కోసం ప్రత్యేక అధ్యాయాన్ని చేర్చినట్టు చెప్పారు.

హైదరాబాద్‌ పుట్టిన దిగ్గజ క్రీడాకారులు అజారుద్దీన్, రవితాం, వీవీఎస్ లక్ష్మణ్, సిరాజ్, నిఖత్ జరీన్, దీప్తి శర్మ వంటి వాళ్లను గుర్తుచేస్తూ వారి ప్రస్థానాన్ని ప్రేరణగా పేర్కొన్నారు. 2026లో జరిగే ఖేలో ఇండియా గేమ్స్‌ను తెలంగాణలో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు సీఎం తెలిపారు.

ఈ సదస్సులో మంత్రి వాకిటి శ్రీహరి, ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అభినవ్ బింద్రా, రాష్ట్ర క్రీడల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, శాట్ చైర్మన్ శివసేనా రెడ్డి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప‌లు అంతర్జాతీయ క్రీడా సంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకుంది.

Leave a Reply