TG | వ‌ర్షాల నేప‌థ్యంలో అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేసిన సీఎం రేవంత్

హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఎలాంటి నష్టం వాటిల్లకుండా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

హైదరాబాద్ పరిధిలో అన్ని విభాగాల అధికారులు అందుబాటులో ఉండాలని, జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా, ట్రాఫిక్, విద్యుత్తు విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. రోడ్లపై నీరు నిల్వ లేకుండా చూడాలని, ట్రాఫిక్ ఇబ్బందులు, విద్యుత్తు సమస్యలు తలెత్తకుండా చూడాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు.

నగరంలో ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా, ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని అన్నారు. వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లో ఎప్పటికప్పుడు వర్షాల పరిస్థితిని సమీక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ముందుస్తు వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు, జ్వరాలు వచ్చే ప్రమాదం ఉంటుందని ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖను అప్రమత్తం చేశారు. ప్రధానంగా ఏజెన్సీ ఏరియాలు, అటవీ ప్రాంతాలున్న జిల్లాల కలెక్టర్లు ప్రజారోగ్యంపై దృష్టి సారించాలని చెప్పారు. పొరుగు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు కూడా నమోదవుతున్నాయని, అన్ని జిల్లాల్లోనూ సీజన్‌కు అనుగుణంగా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

Leave a Reply