TG | సీఐడీ చీఫ్‌గా లేడీ సింగం – ఉగ్రవాదులతో పోరాడిన విమెన్ ఆఫీసర్

కశ్మీర్ వేర్పాటువాదులతో నిత్య పోరాటం
బీహార్‌లో అల్ల‌రి మూక‌కు సింహ‌స్వ‌ప్నం
సీఆర్ఎఫ్ ఐజీగా సమర్థవంతమైన పనితీరు
ఇప్పుడు తెలంగాణ కొత్త సీఐడీ చీఫ్‌గా బాధ్యతలు

సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ : క‌శ్మీర్‌లో ఉగ్రవాదులతో పోరాటం చేసిన లేడీ సింగం చారు సిన్హా.. ఇప్పుడు తెలంగాణ సీఐడీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ కేడర్‌కు చెందిన 1996 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీస‌ర్‌ చారుసిన్హా, 2020లో శ్రీనగర్‌లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సీఆర్బీఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ గా పనిచేశారు. లోయలో రాళ్లు రువ్వడం, ఉగ్రవాదం, వేర్పాటువాదుల అనుచ‌రుల నిరసనలు జరుగుతున్న సమయంలో ఆమెను శ్రీనగర్‌లో నియమించారు. అక్కడ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని, అల్లకల్లోల కశ్మీర్‌లో శాంతిభద్రతలను నెలకొల్పారు. అంతే కాదు ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో కొసావో శాంతి పరిరక్షక దళంలో కూడా పనిచేశారు.

హైదరాబాదీ బిడ్డ..

చారు సిన్హా 1970లో తెలంగాణలోని హైదరాబాద్‌లో జన్మించారు. పువ్వు పుట్టగానే పరిమళించినట్టు నరనరాన దేశభక్తిని పెంచుకుంది, 8వ తరగతి నుండే తన దేశానికి సేవ చేయాలనే కోరికను వ్యక్తం చేసింది. ఇదే విషయానన్ని 2017లో ఓ పత్రిక ఇంటర్వ్యూలో చారు సిన్హ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాల నుంచి గ్రాడ్యుయేషన్‌తో చారు సిన్హ విద్యాప్రయాణం ప్రారంభమైంది, తరువాత హైదరాబాద్ విశ్వవిద్యాలయం నుంచి పొలిటికల్ సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీని పొందింది. ఈ సంస్థలు ఆమెకు పాలన సామాజిక గతిశీలతను అర్థం చేసుకోవడంలో బలమైన పునాదిని వేశాయి. ఫ్యాక్షన్ గడ్డ కడప జిల్లా పులివెందులలో , పచ్చని ప్రశాంత నేల పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా, ఆమె వర్గ వైరుధ్యాలు, మతతత్వం, ఇతర నేరాలకు అడ్డుకట్టు వేశారు. ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా, ఆమె మెదక్ జిల్లాలో తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించారు. అయిదు జిల్లాలకు పోలీసు సూపరింటెండెంట్‌గా నాయకత్వం వహించారు. మహబూబ్‌నగర్, ప్రకాశం జిల్లాల్లో, తీవ్రవాద వ్యతిరేక అధికారిగా తన పనితీరుతో ప్రజల మన్నన పొందారు. అంతే కాదు.. నక్సలెట్లకు మద్దతు ఇవ్వడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి చెంచు గిరిజనులకు అవగాహన కల్పించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఆమె అద్భుతంగా రాణించారు.చిత్తూరు, తూర్పు గోదావరి, నిజామాబాద్ వంటి ఇతర జిల్లాల్లో, మత హింస, వర్గ వైరుధ్యాలు, దారు నేరాలను నియంత్రించారు. మహిళలు, పిల్లలు, వృద్ధులపై ప్రభావితం చూపించే సామాజిక సమస్యలను పరిష్కరించారు.

కీలక ప్రాంతాల్లో వీర వనిత

2005లో స్థాపించిన శ్రీనగర్ సెక్టార్, బుడ్గామ్, గండేర్‌బాల్, శ్రీనగర్ అనే మూడు జిల్లాలకు బాధ్యత వ‌హించారు.. ఇందులో 22 ఆపరేషనల్ యూనిట్లు ఉన్నాయి. బీఎస్ఎఫ్ కశ్మీర్ నుంచి తొలగించిన‌ వెంటనే సీఆర్బీఎఫ్ శ్రీనగర్ సెక్టార్ పనిచేయడం ప్రారంభించింది. శ్రీనగర్ సెక్టార్‌లో రెండు రేంజ్‌లు, 22 ఎగ్జిక్యూటివ్ యూనిట్లు, మూడు మహిళా కంపెనీలున్నాయి. శ్రీనగర్ సెక్టార్ గ్రూప్ సెంటర్ శ్రీనగర్‌పై పరిపాలనా నియంత్రణను కలిగి ఉంది. ఇది లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంపై కూడా అధికార పరిధిని కలిగి ఉంది.

ఇక పుట్టిన గడ్డలో నిఘా అధిపతి

చారు సిన్హా తన మాతృ కేడర్‌కు తిరిగి వచ్చిన తర్వాత ఆమెను తెలంగాణ, హైదరాబాద్, సీఐడీ , అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా వైస్ శిఖా గోయల్‌ని నియమించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆమె అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, మహిళా భద్రత, షీ టీమ్స్ పదవులను కూడా నిర్వహిస్తారు. ఆమెకు ముఖ్యమైన నియామకం ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఆమె బీహార్ సెక్టార్‌లో సీఆర్బీఎఫ్ ఐజీ గా పనిచేశారు. అక్కడ నక్సల్స్‌ను ఎదుర్కొన్నారు. చారు సిన్హా నాయకత్వంలో వివిధ నక్సల్స్ వ్యతిరేక కార్యకలాపాలు జరిగాయి. ఆ తర్వాత ఆమెను జమ్మూకు బదిలీ చేశారు. అక్కడ పదవీకాలం విజయవంతంగా గడిచింది. తరువాత, శ్రీనగర్ సెక్టార్‌లోని సీర్బీఎఫ్ కు నాయ‌క‌త్వం వహించిన తొలి మహిళా ఆఫీస‌ర్‌ అయ్యారు.

అకస్మిక బదిలీల్లో కీలక చోటు

పోలీసు శాఖలో మరో రౌండ్ పునర్నిర్మాణంలో బదిలీ చేసిన ఏడుగురు ఐసీఎస్ అధికారులలో సిన్హా కూడా ఉన్నారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న 1994 బ్యాచ్ అభిలాషా బిష్ట్ , 1995 బ్యాచ్ శ్రీనివాసరావు ను బాధ్యతల నుంచి తప్పించి, హైదరాబాద్‌లోని రావు బ‌హ‌ద్దూర్ వెంక‌ట రామారెడ్డి టీజీపీఏ డైరెక్టర్‌గా నియమించారు. పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా అభిలాష బిస్త్, మహిళా భద్రత విభాగం, సీఐడీ అదనపు డీజీగా చారు సిన్హా, చార్మినార్ రేంజ్ డీఐజీగా తప్సీర్ ఇక్బాల్ నియమితులయ్యారు. శిఖా గోయల్ ఎఫ్ఎస్ఎల్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌గా కొనసాగనున్నారు. మెదక్ ఎస్పీగా శ్రీనివాసరావు, ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీగా పాటిల్ కాంతిలాల్ సుభాష్, సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా చైతన్యకుమార్ బదిలీ అయ్యారు. మైనారిటీల సంక్షేమ శాఖ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి తఫ్సీర్ ఇక్బాల్ (ఐపీఎస్ 2008) బదిలీ అయ్యారు, చార్మినార్‌లోని 4వ జోన్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా నియమితులయ్యారు. కౌమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు , మెదక్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్‌గా నియమితులయ్యారు. కొత్త చీఫ్ సెక్రటరీ నియామకం తర్వాత ఇప్పుడు అందరి దృష్టి కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నియామకంపై ఉంది. సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లు చాలా వినిపిస్తున్నప్పటికీ, తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ముందంజలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

Leave a Reply