TG | యూ ట్యూబ్‌ ఛానళ్లతో జర్నలిజానికే చెడ్డ పేరు : బండి సంజయ్‌

వేములవాడ, ఏప్రిల్‌ 21 (ఆంధ్రప్రభ): కొందరు మీడియా రంగంలో ఎలాంటి అనుభవం లేకపోయినా తెలిసి తెలియని తనంతో యూట్యూబ్‌ ఛానళ్లను నిర్వహిస్తూ జర్నలిజానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారని, యూ ట్యూబ్‌ ఛానళ్ల పేరుతో ఇలా బ్లాక్‌ మెయిలింగ్‌ కు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

వేములవాడకు విచ్చేసిన కేంద్ర మంత్రి స్థానిక ప్రెస్‌ క్లబ్‌- ఐజేయూను సందర్శించారు. ప్రెస్‌ క్లబ్‌ భవన నిర్మాణానికి గతంలో రూ.10 లక్షల మేరకు ఎంపీ లాడ్స్‌ నిధులను మంజూరు చేశారు. ఈ నిధులతోపాటు దాతల సాయంతో నిర్మిస్తున్న ప్రెస్‌ క్లబ్‌ నూతన భవనాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షులు పుట్టపాక లక్ష్మణ్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలోబండి సంజయ్‌ ను గజమాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ యూ ట్యూబ్‌ ఛానళ్ల వల్ల నిజమైన జర్నలిస్టులకు కూడా చెడ్డపేరు వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టు సంఘాలు, ప్రెస్‌ క్లబ్‌ నిర్వాహకులు కూడా ఈ విషయంలో కఠినంగా ఉండాలని కోరారు. ఇదే సమయంలో ప్రజా సమస్యలపై స్పందిస్తూ సమాజ హితం కోసం పనిచేసే యూట్యూబ్‌ ఛానళ్లను కచ్చితంగా ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ విషయంపై త్వరలోనే ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని చెప్పారు. రాష్ట్రంలో జర్నలిస్టులు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలీచాలని జీతాలతో నెట్టు-కొస్తున్న జర్నలిస్టులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు.

ఈసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీయేనని, తాము రాగానే వెంటనే జర్నలిస్టులందరికీ ఇండ్లు నిర్మించడంతోపాటు- హెల్త్‌ కార్డులు, ఇన్సూరెన్స్‌ అందిస్తామని హామీ ఇచ్చారు. దీంతోపాటు- సమాజంలో జర్నలిస్టులు గౌరవప్రదంగా జీవించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మీడియా సహకారం వల్లే తాను ఈ స్థాయికి చేరుకున్నానని గుర్తు చేశారు. ప్రజల కోసం తాను చేసిన ఉద్యమాలను, కార్యక్రమాలను విస్త్రృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం వల్లే రాష్ట్ర, జాతీయ స్థాయిలో పేరు వచ్చిందన్నారు.

గత 17 నెలలుగా కాంగ్రెస్‌ ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయక పోవడంతో ప్రజల పరిస్థితి పెనం నుండి పొయ్యిలో పడ్డట్లయిందన్నారు. హెల్త్‌ కార్డులు పనిచేయడం లేదని, డబుల్‌ బెడ్రూం ఇండ్లు కలగానే మారాయన్నారు. అలాగే వేములవాడ ఆలయ అభివృద్ధికి కట్టు-బడి ఉన్నానని, ఈ ఏడాది కచ్చితంగా కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానన్నారు.

సీఎస్సార్‌ ఫండ్స్‌ కింద వందల కోట్ల రూపాయలు ఖర్చు చెసినప్పటికి కొందరు కావాలనే కరీంనగర్‌కు బండి సంజయ్‌ నయాపైసా కూడా తేలేదని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. వేములవాడ ప్రెస్‌ క్లబ్‌ భవన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు మరో రూ.10 లక్షల సాయం అందించాలని కోరుతూ ప్రెస్‌ క్లబ్‌ నిర్వాహకులు బండి సంజయ్‌ను కోరగా, సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌ తప్పనిసరిగా తనవంతు సాయం అందిస్తానని హామీ ఇచ్చారు.

జర్నలిస్టుల సంక్షేమం విషయంలో తాను ముందుంటానని తెలిపారు. ఈకార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రతాప రామక్రిష్ణ, జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, దళిత మోర్చా రాష్ట్ర నాయకులు కుమ్మరి శంకర్‌, ఐజేయూ జిల్లా అధ్యక్షులు బండి సంతోష్‌లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *