TG Assembly | సభలో చావు డప్పు కొట్టకుండా పెళ్లి డిజె వాయించారు – గవర్నర్ ప్రసంగంపై కెటిఆర్ కామెంట్

హైదరాబాద్ – తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పరిస్థితికి చావు డప్పు కొట్టాలని, కానీ పెళ్లిలో డీజే కొట్టినట్లుగా అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించిన అనంతరం సభ వాయిదా పడింది. అనంతరం మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదో ఉద్దరించిందన్నట్లుగా గవర్నర్ ప్రసంగం సాగిందని విమర్శించారు. ఈ ప్రసంగం గాంధీ భవన్‌లో కాంగ్రెస్ నేతల ప్రెస్‌మీట్‌లా ఉందని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఇచ్చిన 420 హామీలు ఈ ప్రభుత్వం, ఆరు గ్యారంటీల గురించి ఏమైనా కొత్త విషయాలు చెబుతారేమోనని అనుకున్నామన్నారు. ‘గత 15నెలల పేలవమైన, అట్టర్‌ఫ్లాప్‌ పరిపాలన గురించి ప్రాయశ్చిత్తం చేసుకునేవిధంగా గవర్నర్‌ ప్రసంగం ఉంటుందని భావించాం. ఇది గవర్నర్‌ ప్రసంగం లేదు. ఒకమాటలో చెప్పాలంటే గాంధీ భవన్‌లో కాంగ్రెస్‌ కార్యకర్తల ప్రెస్‌మీట్‌లా ఉంది తప్పా.. గవర్నర్‌ ప్రసంగంలా లేదు. గవర్నర్‌ నోటి వెంట ఒకటికాదు రెండు చాలా అబద్ధాలు చెప్పించారు. గవర్నర్‌ నోటివెంట అసత్యాలు పలకాల్సి రావడంపై బాధపడుతున్నాం. కాంగ్రెస్‌ సర్కారు ఘోర వైఫల్యం వల్ల ఈ రోజు రాష్ట్రంలో రైతాంగం ఆందోళనలో ఉంది’ కేటీఆర్‌ తెలిపారు.

గవర్నర్‌ స్థాయిని ప్రభుత్వం దిగజార్చింది..
‘రాష్ట్రంలో ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతున్నయ్‌. ఇప్పటికే 480 పైచీలుకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కనీసం ఒక మాట రైతులకు స్వాంతన చేకూర్చే, ఉపశమనం, భరోసా ఇచ్చేమాట గవర్నర్‌ నోటినుంచి వస్తుందేమోననని ఆశించాం. పంటలు ఎండిపోకుండా కాపాడుతాం. పంటలకు నీరు ఇస్తాం. బుద్ధి తెచ్చుకున్నాం. ఇకనైనా బుద్ధితో మెదులుతామని చెప్పి ఒక్క మాట చెబుతారని అనుకున్నాం. వారి నోటివెంట ఒక్క మాట రాలేదు. అసలు ఈ రోజు వరకు రాష్ట్రంలోని ఏ గ్రామంలో కూడా 25శాతం నుంచి 30శాతానికి మించి రుణమాఫీ జరుగలేదు. దీనిపై పోయిన శాసనసభలో ప్రభుత్వాన్ని అడిగినం. సీఎం సొంత ఊరికి పోదామా? సొంత నియోజకర్గానికి పోదామా? ప్లేస్‌, సమయం మీ ఇష్టం.. ఊరు మీష్టం అని చెప్పాం. ఒక ఊరిలో వందశాతం రుణమాఫీ జరిగితే మేం అందరం రాజీనామా చేస్తామని చెప్పాం. కానీ, మళ్లీ ఈ రోజు గవర్నర్‌ నోటివెంట రుణమాఫీ అయిపోయింది.. లక్షలాది మంది రైతులు సంతోషంగా ఉన్నరని గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించి.. గవర్నర్‌ స్థాయిని సైతం దిగజార్చి మరోసారి కాంగ్రెస్‌ ప్రభుత్వం తన భ్రష్టత్వాన్ని, నీచత్వాన్ని బయటపెట్టుకుంది’ అంటూ కేటీఆర్‌ మండిపడ్డారు.

గవర్నర్‌కే అవమానం..
‘పెట్టుబడి సాయం అందని రైతులు, రుణమాఫీ కాక.. కేసీఆర్‌ హయాంలో ఉన్న రైతుబంధును సైతం కనీసం అమలు చేసే పరిస్థితి లేక ఆగమాగమైపోతుంటే.. రైతుబంధు మొత్తం అందింది.. అది మాత్రమే కాకుండా రైతు కూలీలకు సహాయం చేస్తున్నామని గవర్నర్‌ నోటి వెంట అబద్ధాలు చెప్పించడమంటే గవర్నర్‌కు కూడా అవమానం. గవర్నర్‌ దీన్ని గుర్తించాలి. సాగునీటి సంక్షోభం రోజురోజుకు తీవ్రమవుతుంది. కేసీఆర్‌పై ద్వేషంతో, బీఆర్‌ఎస్‌పై గుడ్డి కోపంతో మేడిగడ్డకు మరమ్మతులు చేయకుండా 15నెలలు ఎండపెట్టడం వల్ల గోదావరి పరీవాహక ప్రాంతంలో ఎండిపోతున్న ప్రతి ఎకరా పంటకు బాధ్యత తీసుకోవాల్సింది రేవంత్‌రెడ్డి అనే ఈ ముఖ్యమంత్రి. రేవంత్‌రెడ్డి అనే చేతగాని ముఖ్యమంత్రి వల్ల రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయి.

పంట ఎండిపోయి రైతులు అవస్థలుపడుతున్న రైతులు.. పంటలకు నిప్పుపెట్టుకుంటున్నరు రైతులు, పొలాల్లో గొర్రెలు మేకలను మేపుతున్న రైతులు గవర్నర్‌ ప్రసంగం నుంచి ఒక్క మాట కోసం ఇవాళ ఎదురుచూశారు. మేం పంటలు ఎండిపోకుండా కాపాడుతాం.. మేం ఉన్నాం.. ఈ ప్రభుత్వం మీకు భరోసా ఇస్తుంది. మేడిగడ్డను రిపేర్‌ చేస్తాం. ఇన్నిరోజులు కేసీఆర్‌పై కోపంతో తప్పు చేశామని ప్రాయశ్చిత్తం చేసుకుంటరనుకున్నామని.. కానీ, ఆ సోయి ఈ ప్రభుత్వానికి లేదు. కనీసం ఒక మాట మాత్రంగా కూడా ఎండుతున్న పంటలు, సాగునీటి సంక్షోభం.. 480 మంది రైతుల ఆత్మహత్యలపై ఒక్కమాట మాట్లాడకపోవడం అంటే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రాధాన్యతలు ఎట్ల ఉన్నయో దీన్ని బట్టే తెలుసుకోవచ్చు’ అంటూ కేటీఆర్‌ విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *