హైదరాబాద్ – కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయానికి విపక్ష బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. బీసీ బిల్లును బీఆర్ఎస్ పార్టీ పక్షాన మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు అసెంబ్లీ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ‘‘విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ వచ్చినప్పుడు, స్థానిక సంస్థల్లో, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 42 శాతం రిజర్వేషన్ ఫలితాలు వారికి అందినప్పుడు ఆ వర్గాలు చాలా సంతోషపడతాయి. వారికి ఆ ఫలితాలు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.. రాష్ట్ర శాసనసభలో మనం బిల్లు ఏర్పాటు చేయడంతో పాటు పార్లమెంటులో పోరాటానికి కూడా బీఆర్ఎస్ పార్టీ కలిసి వస్తుందని తెలుపుతున్నాను’’ అని హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.
అంతేకాదు.. ‘లోక్‌సభలో రాహుల్ గాంధీ ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు.. ఆయన వెనకాల 100 మంది ఎంపీలు కూడా ఉన్నారు.. ఈ బిల్లు కోసం రాహుల్ గాంధీ గట్టిగా పూనుకోవాలి’ అని హరీష్ రావు సూచించారు. గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్ల ఎన్నికలో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించారు. అంతేకాదు.. మొట్టమొదటిసారిగా దేశంలో గౌడ కులస్థుల కోసం మద్యం షాపుల్లో రిజర్వేషన్ సైతం తెచ్చారని అన్నారు.
‘రేపు బడ్జెట్ పెడుతున్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మూడు డిమాండ్లను ప్రభుత్వం ఎదుట పెడుతున్నాం.. ఎలాంటి బేషజాలకు పోకుండా ఆ మూడు అంశాలను బడ్జెట్‌లో చేర్చాలని కోరుతున్నాం’ అని తెలిపారు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలి.. బీసీలకు సబ్ ప్లాన్ అమలు చేస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.. క్యారీ ఫార్వర్డ్ విధానంలో అమలు చేయాలి.. బీసీ బిల్లు ఆమోదం కోసం ఢిల్లీకి సైతం వచ్చి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం.. ఇచ్చిన మాట ప్రకారం బీసీ సబ్ ప్లాన్‌ను చేర్చండి అని హరీష్ రావు రిక్వెస్ట్ చేశారు. ఇందు కోసం బడ్జెట్లో రూ.20,000 కోట్ల నిధులు పెట్టాలని సూచించారు. మేం చేసిన డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం, సుప్రీం కోర్టు అనుమతి అవసరం లేదని, వాటిని వెంటనే అమలునకు చర్యలు తీసుకోవాలని కోరారు.